Artisans Strike: తెలంగాణలో ఆర్టిజన్ల నిరవధిక సమ్మె - ఉద్యోగంలోంచి తీసేస్తామన్నా బేఖాతరు!
Artisans Strike: నిరవధిక సమ్మె చేస్తామంటూ విద్యుత్ ఆర్జిజన్లు పిలుపునివ్వగా విద్యుత్ సంస్థలు ఉద్యోగంలో నుండి తొలగిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. అయినప్పటికీ పలువురు సమ్మెలో పాల్గొంటున్నారు.
Artisans Strike: సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ ఆర్టిజన్లు నిరవధిక సమ్మెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి విధులను బహిష్కరిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఎవరు సమ్మె చేసినా అదే రోజు ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని విద్యుత్ సంస్థల సీఎండీలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆర్టిజన్లు నిరవధిక సమ్మె చేస్తుండడంతో విద్యుత్ ఉన్నతాధికారులు అన్ని స్థాయిల్లో సమీక్షలు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని సబ్ స్టేషన్ల ఇంజినీర్లకు ఆదేశాలు ఇచ్చారు.
సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటాం..!
ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే 34(20) సర్వీసు నిబంధన ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ సంస్థల సీఎండీలు దేవులపల్లి ప్రభాకర రావు, రఘుమారెడ్డి ఆర్టిజన్లను హెచ్చరించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఎస్మా చట్టం కింద సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని సీఎండీలు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కాకుండా ఎవరైనా అంతరాయం కల్పిస్తే దుష్ప్రవర్తన కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో 4 విద్యుత్ సంస్థలు ఉన్నాయి. వీటి పరిధిలో 20 వేల మందికి పైగా ఆర్టిజన్లు పని చేస్తున్నారు. వీరంతా క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ వంటి పనుల్లో ఇంజినీర్లకు సహాయంగా పని చేస్తుంటారు. ఈ నెల 15వ తేదీన కొత్త పీఆర్సీకి శాశ్వత ఉద్యోగ సంఘాలు అన్నీ ఒప్పుకోవడంతో 7 శాతం ఫిట్మెంట్ తో పాటు అదనంగా రెండు ఇంక్రిమెంట్లు ఆర్టిజన్లకు ఇవ్వాలని విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ పెంపు సరిపోదని, మరింత పెంచాలని అలాగే మరో 18 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టిజన్లు సమ్మె నోటీసు ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లకు 7 శాతం వేతనాలు సవరించడంతో వీరిలోని నాలుగు కేటగిరీల వారికి రూ. 1,250 నుండి రూ. 3 వేల లోపే వేతనాలు పెరిగాయని అంటున్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు ఒక్కొక్కరికీ దాదాపు రూ. 50 వేల దాకా జీతాలు పెరిగాయని ఆర్టిజన్లు చెబుతున్నారు. దాంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని నిరవధిక సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టిజన్లు పేర్కొంటున్నారు.
ఆర్టిజన్లు గౌరీ శంకర్, శివ శంకర్ లపై ఎస్మా చట్టం కింద కేసు నమోదు
కార్పొరేట్ కార్యాలయంలో సమ్మెకు పిలుపు ఇస్తూ ప్రచారం చేస్తున్న కార్మికుల సంఘానికి (టీఎస్ ఎస్పీడీసీఎల్ విభాగం) చెందిన ఆర్టిజన్లు గౌరీ శంకర్, శివ శంకర్ లపై సోమవారం ఎస్మా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు ఆర్టిజన్లను పంజాగుట్ట పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆర్టిజన్ల సమ్మెకు బీజేపీ మద్దతు ప్రకటించింది. సమ్మెకు సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్టిజన్ల సంఘం నేతలకు హామీ ఇచ్చారు.