Police Data Hacker: తెలంగాణ పోలీస్ వెబ్ సైట్స్ హ్యాక్ - నిందితుడి అరెస్ట్, రాష్ట్ర పోలీస్ డేటా భద్రంగానే ఉందన్న డీజీపీ రవి గుప్తా
Telangana News: తెలంగాణ పోలీస్ వెబ్ సైట్స్ హ్యాక్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. పోలీసులకు సంబంధించిన సమాచారం ఏదీ లీక్ కాలేదని.. డేటా భద్రంగానే ఉందని స్పష్టం చేశారు.
Telangana Police Arrested State Police Websites Hacker: ఇటీవల పోలీస్ డేటా వెబ్ సైట్స్‌పై హ్యాక్ (Police Websites Hack) చేసి కొంత సమాచారం లీక్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) ఆదివారం తెలిపారు. యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్ కుమార్ నిందితుడిగా గుర్తించినట్లు చెప్పారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కీలకమైన హాక్ ఐ, టీఎస్ కాప్, ఎస్ఎంఎస్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడి కొంత డేటాను తోటి హ్యాకర్లతో కలిసి నిందితుడు దొంగిలించినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డేటా లీక్ ఆధారాలతో ఢిల్లీకి వెళ్లి శనివారం నిందితుడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
ఇలా గుర్తించారు
నిందితుడు జతిన్ కుమార్ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన కొంత డేటాను పబ్లిక్ ప్లాట్ ఫాంలో పోస్ట్ చేశాడని నిర్ధారించినట్లు డీజీవీ రవి గుప్తా తెలిపారు. హ్యాకర్.. చోరీ వివరాలను databreachforum.stలో పోస్ట్ చేశాడని, ఈ చోరీ సమాచారాన్ని $150 USDకి అమ్మకానికి పెట్టాడని చెప్పారు. ఆసక్తి గల కొనుగోలుదారులు వరుసగా హాక్ ఐ, TSCOP డేటాకు సంబంధించి తనను సంప్రదించడానికి టెలిగ్రామ్ ఐడీలు Adm1nfr1end, Adm1nfr1ends అందించినట్లు గుర్తించామని అన్నారు.
'దాచిపెట్టే ప్రయత్నం'
తెలంగాణ పోలీస్ వెబ్ సైట్స్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తనను వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితుడు తన గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నం చేశాడని.. అయినా సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి ఢిల్లీలో అరెస్ట్ చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించారు. 'నిందితునికి సైబర్ క్రైమ్‌ల చరిత్ర ఉంది. గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉంది. న్యూ ఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్ స్టేషన్ ద్వారా Cr.No.291/2023 కింద ఇంతకు ముందు అరెస్టు చేశారు. గత సంవత్సరం, నిందితులు.. ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారు.' అని డీజీపీ తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితుని సహచరులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని.. విచారణ కొనసాగుతోందని అన్నారు.
'డేటా భద్రం'
అయితే, నిందితుడు జతిన్ కుమార్ చోరీ చేసిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ డేటా భద్రంగానే ఉందని డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఏ వినియోగదారుకు సంబంధించిన సున్నితమైన/ఆర్థిక డేటా లీక్ కాలేదని చెప్పారు. Hawkeye మొబైల్ అప్లికేషన్ డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్‌లు, చిరునామాలు, ఈ మెయిల్ ఐడీలు వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని అన్నారు. ప్రాథమికంగా, బలహీనమైన పాస్‌వర్డ్ కారణంగా, చొరబాటుదారుడు నివేదికను రూపొందించడం ద్వారా హక్ ఐ డేటాలోని నిర్దిష్ట విభాగాలకు యాక్సెస్‌ని పొంది ఉండవచ్చని అనుమనిస్తునామన్నారు. TSCOPలో సమాచారం సేఫ్‌గా ఉందని.. థర్డ్ పార్టీ డేటా అమ్మారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీస్ SMS, సర్వర్స్ URL విషయంలో సైబర్ నేరగాళ్లు చొరబడ్డారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఎందుకంటే URL ఏప్రిల్ 2022 నుంచి పనిచేయ లేదని.. హైదరాబాద్ సిటీ పోలీసులు దాని వినియోగాన్ని చాలా కాలం ముందే నిలిపేశారని పేర్కొన్నారు.
హ్యాకింగ్‌పై భద్రతాపరమైన లోపాలు ఉన్నాయేమోనని పరీక్షిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి హ్యాకింగ్స్ నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయెల్ పర్యవేక్షణలో తక్కువ టైంలోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, ఎ.సంపత్, ఇన్‌స్పెక్టర్ ఆశిష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురేష్‌లను డీజీపీ అభినందించారు.