![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రధానికి స్వాగతం పలికారు.
![PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి PM Modi reaches Shamshabad airport, leaves to Mahabub nagar in special Helicopter PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/28b1c0abc59a8f922c1c18c520c702c31696151124166234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రధానికి స్వాగతం పలికారు. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు.
మహబూబ్ నగర్‌లో ఎన్నికల శంఖారావం
మహబూబ్ నగర్ జిల్లా వేదికగానే ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ‘పాలమూరు ప్రజా గర్జన’ పేరుతో భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ముందుగా రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. ఇంకొన్ని పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. ఆ తర్వాత సభలో పాల్గొంటారు. సభా వేదికగా తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటించే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది. సీఎం కేసీఆర్ పైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది.
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు
ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. మోదీకి మహబూబ్‌నగర్‌లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్ల ద్వారా నిరసన తెలిపారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయమై జరిగిన అన్యాయంపై ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వేశారు. తెలంగాణ మీద మోదీ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు.
తెలంగాణ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ మరికొన్ని చోట్ల పోస్టర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. తెలంగాణ పుట్టుకను పదే పదే పదే అవమానిస్తున్న మోదీకి తెంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. What happened Modi అంటూ ఎయిర్ పోర్ట్ పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు ద్వారా ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది.? పసుపు బోర్డు ఎక్కడ.? మీ హామీలు అన్ని నీటి ముటలేనా అంటూ ప్లెక్సీలలో ప్రశ్నించారు. రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,టెక్ష్ట్స్ టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, మిషన్ భగీరథ నిధులు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. పోస్టర్లపై బీజేపీ శ్రేణులు స్పందించాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)