Telangana Aarogyasri: తెలంగాణలో వైద్య సేవలు ఆపొద్దు ప్లీజ్..! ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు సీఈవో విజ్ఞప్తి
నేటి అర్ధరాత్రి నుండి తెలంగాణ వ్యాప్తంగా ప్రవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. 1400 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి నెట్ వర్క్ ఆసుపత్రులు

Aarogyasri Service Stopped in Telangana | తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి నుండి ప్రవేటు ఆసుత్రులలో పేదలకు ఉచిత వైద్యం నిలిచిపోనుంది. లక్షల ఖరీదైన వైద్యసేవలను పేదలకు ఉచితంగా అందించే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ వేశాయి తెలంగాణలో నెట్ వర్క్ ఆసుపత్రులు. గత ఏడాది నుండి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం నుండి 1400 కోట్లు రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల విడుదల కోసం గత ఇరవై రోజులుగా వైద్యశాఖ అధికారులతో పలు ధఫాలుగా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులతో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో 323 ప్రవేటు ఆసుత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా నిరు పేదలకు ఉచిత వైద్యం అందుతోంది. తాజాగా ప్రవేటు ఆసుపత్రుల నిర్ణయంతో నిరుపేదలకు వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
ఆసుపత్రులకు భారంగా మారిన సర్వీసులు
గత కొంత కాలంగా పెండింగ్ బకాయిల విడుదలకు ప్రవేటు ఆసుపత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆసుపత్రుల నిర్వహణ, సిబ్బందికి జీతాలు, మందుల కొనుగోలు ప్రవేటు ఆసుపత్రులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో వైద్య సేవల బంద్ నిర్ణయం తీసుకోక తప్పలేదంటున్నాయి నెట్ వర్క్ ఆసుపత్రులు. ఇవే కాకుండా వైద్య సేవలకు సంబంధించి పాత ధరలు పెంచాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా పంట్టించుకోవడంలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా సర్కూలర్ లు విడుదల చేయడంతోపాటు, ఎంఓయూలు పునరుద్దరణ జరగడంలేదంటూ నేటి అర్ధరాత్రి నుండి తెలంగా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి.
అలా చేయవద్దన్న ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల నిర్ణయంపై ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ స్పందించారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచడంతో పాటు, గడిచిన 21 నెలల్లో 1779 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
ప్యాకేజీల చార్జీల పెంపు కోసం ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్దకాలం ఎదురుచూశాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికిపైగా తెలిపారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి, పేషెంట్లను ప్రభుత్వం ఆదుకుందన్నారు. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీలు చేర్చడంతో అదనంగా ₹487.29 కోట్లు పేషెంట్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఇదిలా ఉంటే 2014 నుండి 2023 నవంబర్ వరకూ సగటున నెలకు ₹57 కోట్ల రూాపాయలలు బిల్లుల రూపంలో హాస్పిటళ్లకు చెల్లించామన్నారు. 2023 డిసెంబర్ నుండి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ప్రస్తుతం నెలకు ₹95 కోట్లు చెల్లిస్తున్నామని, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ ఆరోగ్యశాఖ సీఈవో ఉదయ్ కుమార్ తెలిపారు.
హాస్పిటల్స్ యాజమాన్యాలు కోరిన ఇతర సమస్యల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.





















