Palabhishekam to CM KCR: శబరిమలలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం - బీఆర్ఎస్ ముందుకు సాగాలంటూ కామెంట్లు!
Palabhishekam to CM KCR: శబరిమలలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి అయ్యప్ప స్వాములు పాలాభిషేకం చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Palabhishekam to CM KCR: బీఆర్ఎస్ పార్టీ దేశంలో వేగంగా ముందుకు సాగాలని కోరుతూ.. అయ్యప్ప స్వాములు శబరిమలలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానం సమీపంలో కేసీఆర్ తో పాటు బోయిన్ పల్లి వినోద్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు అయితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దేశ ప్రజల కోరిక మేరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ముందుకు సాగేలా ఆశీర్వదించాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ అర్చనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలోనూ శబరిమలలో మొట్ట మొదటి సారిగా తెలంగాణ జెండాను ఎగురవేసినట్లు జీఎస్ ఆనంద్ గురుస్వామి తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు కట్టాని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సహచరులకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మనోహర్, రాజు, మహేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో అక్కడక్కడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు
సంక్రాంతి పండుగకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో ప్రధాన నగరాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టారు. గుంటూరు, విజయవాడ, యానాం, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరంతో పాటు రద్దీ ప్రాంతాల్లో పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు, హోర్డింల్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోలు కూడా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి మారిన తర్వాత బీఆర్ఎస్ గా మారిన తరువాత మొదటి సారిగా ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభ బాగా ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ తలపెట్టిన సభ ద్వారా తెలంగాణ ప్రజలనే కాకుండా సాధ్యమైనంత వరకూ సమీప ప్రాంతాలైన ఏపీ ప్రజల్ని కూడా ప్రభావితం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే సరిహద్దు జిల్లాలను సభ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ భారీ ఎత్తున నిర్వహించే సభలో కేసీఆర్ చేసే ప్రసంగం గట్టి మెసేజ్ ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ భారీ సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేయడంలో నేతలు నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో జనాన్ని తరలించే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించగా.. ఏపీ నుంచి ప్రజలను సభకు తరలించే బాధ్యతను ఏపీ బీఆర్ఎస్ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థ సారథి తదితరులు చూసుకుంటున్నారు. ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్, వి.శ్రీనివాస్ గౌడ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సుమారు ఐదు లక్షల మంది జనాన్ని సభకు తరలించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.