Paddy Procurement: తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు - ఉగాది తర్వాత ఉడుకు చూపిస్తాం: రాష్ట్ర మంత్రులు
Paddy Procurement In Telangana: వడ్లు కొనమంటే తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూకల బియ్యం ప్రజలకు తినిపించమని హేళన చేశారని మంత్రులు మండిపడ్డారు.
Paddy Procurement In Telangana: మా వద్ద వడ్లు కొనే సామర్థ్యం లేదు. కేంద్రాన్ని కొనమంటే తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూకల బియ్యం ప్రజలకు తినిపించమని హేళన చేశారని, కనుక తెలంగాణ ప్రజలకు కేంద్రం, బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేంద్రం ధాన్యం కొంటే మేము పూర్తిగా సహకరిస్తామని, మీరు కొంటానంటే మేము ముందే రైతులకు డబ్బులు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు.. ఉగాది తర్వాత తెలంగాణ ఉడుకు చూపిస్తామని రాష్ట్ర మంత్రులు అన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
వారంతా అనుభవించారు.. ఇక కేంద్రం వంతు..
మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడు ఫలితాన్ని అనుభవించారు. ఈ దేశ రాజకీయాలలో తిరుగులేదనుకున్న ఇందిరాగాంధీ అనామకుల చేతిలో భంగపడ్డారు. తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో లేకుండాపోయారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాలు, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల మేరకు.. ఎన్నో అడ్డంకులు, కుట్రలు చేధించి కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఏడేళ్లుగా ఇష్టపడి అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు.
కేంద్రం నుంచి సహకారం లేదు..
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదని మంత్రులు మండిపడ్డారు. మేం కష్టపడి కాళేశ్వరం కట్టుకున్నాం. పాలమూరు రంగారెడ్డి 70 శాతం పనులు పూర్తయ్యాయి. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశాం. మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నాం. కృష్ణా గోదావరి నీళ్లతో వాటిని నింపుకుంటున్నాం.
ఆరు దశాబ్దాల అన్యాయాల తాలూకు చేదు జ్ఞాపకాలు దిగమింగుకుంటూ ప్రగతి వైరు శరవేగంగా అడుగులు వేస్తూ నవ తెలంగాణ నిర్మించుకుంటున్నాం. వ్యవసాయం ప్రధానరంగంగా గుర్తించి కేసీఆర్ గారు ఈ రంగం మీద దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ సాగునీళ్లిచ్చి, రైతుబంధు, రైతుభీమా ఇచ్చి, 24 గంటల ఉచిత కరంటు ఇచ్చి చేదోడా వాదోడుగా నిలుస్తున్నారు. అత్యధిక శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం బలోపేతమయితే గ్రామాలు సుస్థిరమవుతాయన్నది కేసీఆర్ ఆలోచన.
పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే..
‘ఈ దేశంలో పండిన పంటలు కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వేలుకేస్తే కాలుకు, కాలుకేస్తే వేలుకేస్తున్నారు. రా రైస్ , బాయిల్డ్ రైస్ పేరుతో కేంద్రం లేకి రాజకీయాలు చేస్తుంది. బీజేపీ నేత రైతులను మీరు వడ్లు వేయండి. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాది అంటడు. కేసీఆర్ కు ఏ సంబంధం అంటాడు. కేంద్ర మంత్రి మేం తెలంగాణ వడ్లు కొనం అంటాడు. తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తయి. రా రైస్ రావు .. క్వింటాలుకు 67 శాతం బియ్యం రావు. కందులు, గోధుమలకు లేని నిబంధన వడ్లకు ఎందుకు ? సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా మెదడుకు తాళం వేసుకుంటే మీరెందుకు ?. కిషన్ రెడ్డి ఎన్నాళ్లు పదవిలో ఉంటావు ? రైతుల పక్షాన ఇక్కడ ఉన్న సమస్యపై ఎందుకు మాట్లాడవు ? ఏనాడైనా ఈ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర మంత్రి వద్దకు వచ్చి మాట్లాడావా ?. అన్ని తెలిసిన కిషన్ రెడ్డి ప్రతి గింజ కొంటం. అంటడు రా రైసే కావాలి అంటారని’ తెలంగాణ మంత్రులు తెలిపారు.