Gandhi Bhavan: ఖాకీ నిఘాలో గాంధీ భవన్, ఎవర్నీ వదలని పోలీసులు
గాంధీ భవన్ ఖాకీ నిఘాలో ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు ఏ క్షణం ఏం చేస్తారో అని భారీగా పోలీసులు మోహరించారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలేదని ఎన్ ఎస్ యు ఐ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
ఉదయం నుంచి హాట్ హాట్
ఉదయం నుంచి గాంధీభవన్ పరిసర ప్రాంతాలు విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులతో నిండిపోయింది. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్‌తో వాళ్లంతా టీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి యత్నించారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు భారీగా చేరుకోవడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.
నోటిఫికేషన్లు ఎక్కడా?
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన కేవలం రాజకీయమే అంటూ విమర్శించారు విద్యార్థి నాయకులు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్న కేసీఆర్.. నిరుద్యోగులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే అదిగో ఉద్యోగాలు అంటూ ఊరించి దృష్టి మళ్లిస్తున్నారన్నారు. కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేసి రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల కాలేదని గుర్తు చేశారు.
భారీగా పోలీసుల మోహరింపు
ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల ప్రోగ్రామ్ తెలుసుకున్న పోలీసులు ముందస్తుగానే గాంధీ భవన్ చుట్టుముట్టారు. ఎవరూ గాంధీభవన్ దాటి రాకుండా, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఉద్రిక్తత వాతావరణం కనిపించింది.
అరెస్టులు- తోపులాట
పోలీసుల కట్టడిని కూడా ఛేదించుకొని టీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి బయల్దేరారు విద్యార్థులు.సుమారు వెయ్యి మంది ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు గాంధీభవన్ నుంచి బయలుదేరి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యలో వాళ్లను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
Glimpses from #CharchaVedika, Gandhi Bhavan.@nsui @Neerajkundan @NAVEDKHANNSUI @Allavaru @vidyarthee @TSNSUI @INCTelangana @RahulGandhi @manickamtagore @revanth_anumula pic.twitter.com/mLj7rCCbsY
— Venkat Balmoor (@VenkatBalmoor) March 16, 2022
నిఘాలో గాంధీ భవన్
గేట్లు దూకి బారికేడ్లను, ముళ్లకంచెలు లెక్కచేయకుండా టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి చేరుకునేందుకు యత్నించిన వారిని అతి కష్టమ్మీద అరెస్టు చేశారు పోలీసులు. ఈ అరెస్టులపై కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు దిగారు. బల్మూరి వెంకట్ సహా విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఇంకా పోలీసులు గాంధీ భవన్ చుట్టూ మోహరించి ఉన్నారు.