తెలంగాణ రోడ్లపై కొత్త బస్సులు- ఆధునిక టెక్నాలజీతో భద్రమైన ప్రయాణం!
నేటి నుంచి తెలంగాణలో ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త సూపర్ లగ్జరీ బస్సులు రానున్నాయి. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ కొత్త బస్సుల్లో ప్రయాణం సరికొత్త అనుభూతిని కలిగించనుంది.
ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోంది. దీనిలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనలతో రవాణా శాఖ కొత్త బస్సులను రొడ్డెక్కించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 392 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనంగా రూపొందించిన 1016 కొత్త బస్సులను కొనుగోలు ప్రక్రియ పూర్తైంది. వీటిలో మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇస్తే ఇప్పటికే కొన్ని సూపర్ లగ్జరీ బస్సులు తయారీ పూర్తయి డిపోకు చేరుకున్నాయి. వీటితోపాటు మిగతా బస్సులు కూడా రాబోయే మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై కొన్ని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కొత్తగా తయారు చేసిన సూపర్ లగ్జరీ బస్సుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా ఈ బస్సులలో అనేక ప్రత్యేకతలున్నాయి.
▪️ట్రాకింగ్ సిస్టం.. పానిక్ బటన్.. సిసి కెమెరాలతో భద్రత
కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతోపాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించడం జరిగింది. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసారు. అంతేకాదు ప్రయాణికులకు బస్సులో ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే క్షణాల్లో టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతోపాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రమాదవశాత్తు బస్సులో మంటల చెలరేగితే వెంటనే అలారం సిస్టమ్ అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో డ్రైవర్ వద్ద మైక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్, ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి దానిని లోపల అమర్చిన సిసి కెమెరాలకు అనుసంధానం చేసారు. ఇలా గతంలో సూపర్ లగ్జరీ బల్సులతో పోల్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు ఈ కొత్త బస్సులలో కల్పించారు.