Naveen Murder Case: నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు- వేకువజామున సీన్ రీకన్స్ట్రక్షన్
Naveen Murder Case: నవీన్‌ను హత్య చేసిన అనంతరం వివిధ ప్రాంతాల్లో తిరిగిన హరిహరకృష్ణ అక్కడ తన బంధువులు, స్నేహితులతో ఏం మాట్లాడాడు.. హత్యపై ఏమైనా సమాచారం ఇచ్చాడా అన్న కోణంలో విచారిస్తున్నారు.
Naveen Murder Case: నవీన్ హత్య కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. పోలీసు కస్టడీలో ఉన్న హరిహర కృష్ణను ఇవాళ కూడా సుదీర్ఘంగా విచారించనున్నారు. వేకువజామున ఆయన్ని డెత్‌స్పాట్‌కు తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారని తెలుస్తోంది.
నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ ఒక్కడే చేశాడా ఆయనకు ఇంకా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. రెండో రోజు ఆయన్ని సుదీర్ఘంగా విచారించనున్నారు పోలీసులు. హత్య వెనుక ఉన్నది ఎవరు.. మొదటి నుంచి ఆయనకు హెల్ప్ చేసింది ఎవరు అనేది తేల్చేందుకు పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట‌్ట వద్ద హత్య జరిగిన ప్రాంతానికి హరిహర కృష్ణను తీసుకెళ్లారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకున్నారు. అక్కడ నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ ఏం చేశాడనేది తెలుసుకున్నారు. హత్య చేసిన అనంతరం ముసారాంబాగ్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి తన అక్క ఇంటికి తీసుకెళ్లారు. ఇలా హత్య చేసిన తర్వాత ఎక్కడెక్క తిరిగాడనేది తెలుసుకుంటున్నారు.
హత్య అనంతరం వివిధ ప్రాంతాల్లో తిరిగిన హరిహరకృష్ణ అక్కడ తన బంధువులు, స్నేహితులతో ఏం మాట్లాడాడు.. హత్యపై ఏమైనా సమాచారం ఇచ్చాడా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. అతని ప్రియురాలిని కూడా విచారిస్తున్నారు. ఆమె విచారణకు సహకరించలేదని తెలుస్తోంది.
నిన్న విచారణలో ఏం జరిగిందంటే?
హరిహరకృష్ణను చర్లపల్లి జైలు నుంచి ఎల్బీనగర్ ఎస్ఓటీ ఆఫీస్ కు తరలించారు. పోలీసు కస్టడీలో నవీన్ హత్యపై కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తరలించే క్రమంలో నిందితుడు పారిపోకుండా కాళ్లకు బేడీలు వేశారు. అయితే హరిహరకృష్ణలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడంలేదని అతడిని పరిశీలించిన వాళ్లు అంటున్నారు.
7 రోజుల పాటు పోలీస్ కస్టడీ
అయితే నవీన్ హత్యకేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు 7 రోజులపాటు ప్రశ్నించనున్నారు. నవీన్ హత్య కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడికి కొందరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత నిందితుడు ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లి బట్టలుమార్చుకోవడం, మరో స్నేహితుడికి ఫోన్ చేసి డ్రగ్స్, గంజాయి గురించి చర్చించడం, నిందితుడు తండ్రి, లవర్ కు విషయం చెప్పినా వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగిన వారం రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయినా హరిహరకృష్ణ.. ఈ వారం రోజుల పాటు ఏంచేశాడు, ఎవరు అతడికి సాయం చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కీలకంగా మారింది. నవీన్ హత్యలో స్నేహితుల పాత్ర, లవ్ స్టోరీలో యువతి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హరిహరకృష్ణకు వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన లవర్ తో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడు నవీన్‌ను హరిహరకృష్ణ అత్యంత హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన నిందితుడు హరిహరకృష్ణను చర్లపల్లి సెంట్రల్ జైలును ఎల్బీనగర్ ఎస్ఓటీ ఆఫీస్ కు తరలించారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు నిందితుడి కస్టడీ కోరారు. ఈ మేరకు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ చేశారు. పోలీసుల తరఫున అదనపు పీపీ ప్రతాప్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ ... హరిహర కృష్ణను 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. హరిహర కృష్ణ పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత, ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ తొందరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణలో యువతి నిహారిక సహకరించడంలేదని పోలీసులు అంటున్నారు. మద్యం, గంజాయి మత్తులో నవీన్ ను హత్య చేసి, శరీర భాగాలు కోశాడని హరిహరకృష్ణ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.