Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంఛార్జ్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
Nandhikanti Sridhar Quits Congress and Joins BRS:
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్నారు. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంఛార్జ్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో బీఆర్ఎస్ మల్కాజిగిరి సీటు శ్రీధర్ కు దక్కుతుందని వినిపిస్తోంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆ టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో వారిద్దరూ ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో ఉండే ఛాన్స్ ఉంది. అయితే వేరే పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగితే పార్టీ తనను గెలిపిస్తుందా, ఎమ్మెల్యేగా చేసిన పనులు మైనంపల్లిని గెలిపిస్తాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే బీఆర్ఎస్ మల్కాజిగిరి సీటుపై స్పష్టత రానుంది.
కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ కు గుర్తింపు దక్కలేదు.. కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేసినా శ్రీధర్ కు అక్కడ తగిన గుర్తింపు లభించలేదన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ లో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించామన్నారు. బీఆర్ఎస్ లో శ్రీధర్ కు తగిన గౌరవం కల్పిస్తాం అన్నారు. పార్టీ కోసం అత్యంత నిబద్ధతతో పని చేసే వ్యక్తి బీఆర్ఎస్ లో చేరడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరింతగా పనిచేస్తాం. మాకు ఏ హైకమాండ్ లేదని, మాకు ఉన్నది కేసీఆర్ అని పేర్కొన్నారు. శ్రీధర్, ఆయన మద్దతుదారులు కలిసి మల్కాజిగిరి సీటును గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సీటు మనదేనని, బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మైనంపల్లితో టికెట్ గొడవ - కాంగ్రెస్ కు శ్రీధర్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడితో పాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. తనకు బీఆర్ఎస్ తొలి జాబితాలో మల్కాజిగిరి టికెట్ వచ్చినా, మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ రాని కారణంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి, ఆయన కుమారుడికి మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ కేటాయిస్తోంది. దాంతో 3 దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఖర్గేకు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి సీటు ఆశించానని, అయితే పొత్తుల కారణంగా అప్పుడు సీటు రాలేదని.. ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం నచ్చక కాంగ్రెస్ ను వీడుతున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు రాసిన లేఖలో ఆయన ప్రస్తావించారు. మెదక్ టికెట్ మైనంపల్లి తనయుడు రోహిత్ కు ఇస్తున్నారని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడారు.