అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్‌కు సంగీత దర్శకుడు థమన్ ఛాలెంజ్!
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని సంగీత దర్శకుడు థమన్ స్వీకరించారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని సంగీత దర్శకుడు థమన్ స్వీకరించారు. అంతే కాకుండా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 'థమన్' మాట్లాడుతూ... 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, ఒక ప్రాణం పోసినట్లుగా గొప్ప అనుభూతి కలిగిందని అన్నారు. ఇప్పటి వరకు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ద్వారా 16 కోట్లకుపైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు.
గో గ్రీనరీ ఇండియాకు గ్రీన్ ఛాలెంజ్ ఉపయోగపడుతోంది..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను థమన్ ప్రశంసించారు. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ గా కనిపించే హైదరాబాద్ నగరంలో అభివృద్ధితోపాటు పచ్చదనం పెంచేలా తీసుకొచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా బాగుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పచ్చదనం మరింత పెరుగుతుందన్నారు. గో గ్రీనరీ ఇండియా కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉపయోగపడుతుందని థమన్ వివరించారు. భవిష్యత్తులో పచ్చదనాన్ని పెంచేందుకు చేపట్టే కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని థమన్ ఆకాంక్షించారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు మణిశర్మకు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు థమన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
మొక్కలు నాటిన అనంతరం థమన్.. మరో ముగ్గురు సంగీత దర్శకులకు గ్రీన్ ఛాలెంజ్ ని విసిరారు. అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్ కు థమన్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'ను విసిరారు. జులై 26వ తేదీన సంగీత దర్శకుడు మణిశర్మ.. థమన్ తో పాటు ఆయన కుమారుడు మహతి స్వర సాగర్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
పుట్టిన రోజున ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటండి..
గ్రీన్ ఛాలెంజ్ ను తీసుకొచ్చిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. గతంలో మరో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున విధిగా మూడు మొక్కలు నాటి వాటిని కన్నబిడ్డల్లా సంరక్షిచాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితోనే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని వెల్లడించారు. భారతదేశ పర్యావరణ ఉద్యమానికి రెండు కార్యక్రమాలు సరికొత్త ఉత్తేజాన్ని అందించాయన్నారు.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కూడా స్వీకరించేలా..
యువత, విద్యార్థులు త్వరగా ఆకర్షితులు అయ్యేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖుల, అంతార్జాతీయ క్రీడాకారులను భాగస్వాములను చేశారనని సంతోష్ కుమార్ అన్నారు. త్వరలోనే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కూడా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించేలా విజ్ఞప్తి చేస్తానని ఆయన చెప్పారు. ఆటపాటల ద్వారా చెట్ల ప్రాముఖ్యతను బాల్య దశ నుంచే విద్యార్థులకు ప్రభోదించాలని పద్మశ్రీ వనజీవి రామయ్య సూచించారు.