Crime news: 12 ఏళ్ల పగ.. తండ్రిని చంపిన వాడిని ఇప్పుడు చంపేశాడు!
Crime news: పగ మనిషిని దహించి వేస్తుంది. అది చల్లారే వరకు నిద్రపోనివ్వదు. ఎన్ని ఏళ్లు గడిచినా మనసులోని పగ అలాగే ఉంటుంది. హైదరాబాద్ జవహర్ నగర్ హత్య కేసులో పగ కోణం వెలుగులోకి వచ్చింది.
Crime news: అది 2009వ సంవత్సరం. దమ్మాయిగూడ ఉప సర్పంచిగా ఉన్నాడు జంగారెడ్డి. అయితే కొన్ని కలహాల వల్ల జంగారెడ్డిని రఘుపతి చంపించాడు. దీంతో జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రఘుపతిపై పగ పెంచుకున్నాడు. ఆనాటి నుండి తండ్రిని చంపిన రఘుపతిని అంతకంటే కిరాతకంగా చంపాలను అనుకుంటున్నాడు. అదునైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. అలా 12 ఏళ్ల గడిచాయి. కానీ శ్రీకాంత్ రెడ్డి పగ మాత్రం చల్లారలేదు. అది అతడిని దహించివేస్తోంది. ఎలాగైనా రఘుపతిని చంపాలనుకున్నాడు. అతడిపై అనుమానం రావొద్దని సుపారీ వ్యక్తులను మాట్లాడాడు.
కట్ చేస్తే.. దమ్మాయిగూడలోని ఓ వైన్స్ వద్ద ఈ నెల 15న రఘుపతి, అతని స్నేహితులు ప్రసాద్, బాబు, రామానుజన్ మద్యం సేవిస్తున్నారు. అప్పటికే మూడు రోజుల ముందు నుండి రెక్కీ చేస్తున్న సుపారీ హంతకులు.. అదే సరైన సమయం అనుకుని ఫిక్స్ అయ్యారు. కత్తులు, వేటకొడవళ్లతో రఘుపతి మీదకు దూకారు. అతడిపై కత్తులు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో రఘుపతికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా రక్తమోడుతున్న రఘుపతిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో రఘుపతి స్నేహితుడు ప్రసాద్ కు కూడా గాయాలు కాగా.. అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
5 రోజుల తర్వాత దొరికారు?
పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన సంఘటన స్థలం వద్ద వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. సీసీటీవీ ఫుటేజీ ఉన్నా... అది వారికి పెద్దగా ఉపయోగపడలేదు. పలు బృందాలను ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగి ఐదు రోజులు గడిచిన తర్వాత పోలీసులు నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్... హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈనెల 15న జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో హత్య జరిగిందని తెలిపారు. రియల్టర్ రఘుపతి అలియాస్ రఘు, అతని స్నేహితడు ప్రసాద్ పై నిందితులు కత్తులతో దాడి చేశారని తెలిపారు పోలీసులు.
నిందితులను ఎలా పట్టుకున్నారు?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట సాంకేతిక ఆధారాలను అన్వేషించారు. అలాగే హత్య జరిగిన సంఘటన స్థలంలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చారు. మల్కాజ్ గిరి ఎస్వోటీ, జవహర్ నగర్ క్రైమ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. హతుడిపై ఏమైన కేసులు ఉన్నాయా అని వెతికారు. ప్రత్యర్థులపై దృష్టి పెట్టారు. 2009లో అప్పటి దమ్మాయిగూడ ఉప సర్పంచి జంగారెడ్డి హత్య కేసులో రఘుపతి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జంగారెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.
ఎలా హత్య చేశారు?
రఘుపతిని చంపాలనుకున్న శ్రీకాంత్ రెడ్డి... సుపారీ గ్యాంగ్ తో కాంటాక్ట్ అయ్యాడు. రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. తన తండ్రికి మిత్రుడైన కర్ణాటక వాసి మంజునాథకు సుపారీ ఇచ్చాడు శ్రీకాంత్ రెడ్డి. రఘుపతిని చంపేందుకు ఒప్పుకున్న మంజునాథ... తనతో పాటు మహమ్మద్ సాధిక్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్, భవిత్ లను తీసుకువచ్చాడు. రఘుపతిని ఎలా చంపాలని మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. వైన్స్ వద్ద తాగుతుండగా.. అదే సరైన సమయం అనుకుని హత్య చేశారు.