Forbes Worlds Billionaires List: 12వ తరగతి రెండుసార్లు తప్పారు, ఆపై రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ గా రికార్డ్ - ఆయన స్టోరీ ఇదీ
Forbes Worlds Billionaires List: దివీస ల్యాబోరేటరీస్ ఎండీ మురళీ దివి హైదరాబాద్ లోనే అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు.
Forbes Worlds Billionaires List: చదువు లేకపోతే జీవితమే లేదనుకుంటారు చాలా మంది. కానీ చదువు లేకపోయినా ఉన్నత స్థాయిలో ఉన్న వారు మన కళ్లముందే ఎంతో మంది ఉన్నారు. కొందరు ఒకటికి రెండుసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయినా.. ఆ తర్వాత పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతారు. మరికొందరు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. అందుకు దివీస్ ల్యాబ్స్ ఎండీ మురళీ దివి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన 12వ తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యారు. కానీ ఆ తర్వాత పట్టుదలతో పరిశ్రమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లోనే అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం మురళీ దివి నికర విలువ దాదాపు రూ.53 వేల కోట్లు (USD 6.4 బిలియన్లు). యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల మొదటి మూడు తయారీదారుల్లో ఒకటైన దివీస్ ల్యాబోరేటరీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 97, 476 కోట్లుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఓ చిన్న పట్టణంలో జన్మించారు మురళీ దివి. చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టలేదు. 12వ తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా దానిని పూర్తి చేశారు. తన అన్నలాగే బీఎస్సీ చదవాలని నిశ్చయించుకుని మణిపాల్ కాలేజీలో చేరారు. వారిది 14 మంది ఉన్న ఉమ్మడి కుటుంబం. వాళ్ల నాన్నకు వచ్చే రూ.10 వేల పెన్షన్ తోనే ఇల్లు గడవాలి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మురళీ స్థానికంగా ఉన్న ఓ సంస్థలో ఫార్మసిస్టుగా పని చేశారు. ఆ సమయంలో మురళీ జీతం నెలకు రూ.250. 1976 లో అంటే తన 25వ ఏటా.. ఇక్కడ ఉంటే ఎదుగూ బదుగూ ఉండదని భావించి అమెరికా వెళ్లాలనుకున్నారు. కానీ ఆయన వద్ద ఉన్నవి కేవలం రూ.500 మాత్రమే. స్నేహితులు, తెలిసిన వాళ్లు సాయం చేస్తే ఎలాగోలా అమెరికా చేరుకున్నారు. అక్కడ పలు సంస్థల్లో ఫార్మసిస్టుగా మంచి వేతనానికి పని చేశారు. అదే సమయంలో తనను తాను మెరుగుపరచుకున్నారు. అలా 1984 లో చేతిలో 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చి.. తన స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989 లో రెడ్డి ల్యాబ్స్ ఈ కెమినార్ సంస్థను టేకోవర్ చేసింది. ఆ తర్వాత ఆరేళ్ల పాటు మురళీ రెడ్డి ల్యాబ్స్ లోనే పని చేశారు. 1995 లో మురళీ దివి ల్యాబ్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్ శివారు చౌటుప్పల్ లో మొదటి ఫ్యాక్టరీని స్థాపించారు. 2002 లో విశాఖపట్నంలో రెండో ఫ్యాక్టరీని నిర్మించారు.
Also Read: Tomato Price Drop: దిగొస్తున్న టమాటా ధర - భారీగా తగ్గుదల, హైదరాబాద్‌లో ఎంతంటే?
ప్రారంభంలో దివీస్ ల్యాబ్స్ APIలు, ఇంటర్మీడియట్ ల తయారీకి వాణిజ్య ప్రక్రియలను అభివృద్ది చేసే వ్యాపారంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ ఫ్యాక్టరీ ద్వారా 2022 మార్చిలో 88 బిలియన్ల వ్యాపారాన్ని చేసి రికార్డు నెలకొల్పింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మురళీ దివికి చోటు పొందారు. ప్రస్తుతం మురళీ దివి రూ. 53 వేల కోట్ల ఆస్తులతో హైదరాబాద్ లోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచారు.