Mahabubabad District Crime News: ఇద్దరు కుమారులను చంపి బతుకమ్మ ఆడిన తల్లి- మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన
Mahabubabad District Crime News: కన్నతల్లి తన ఇద్దరి కుమారులను చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాగి వచ్చిన భర్తపై కోపంతో ఈ దారుణానికి పాల్పడింది.

Mahabubabad District Crime News: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. అంతకంటే ముందు చిన్న కుమారుడిని కూడా ఆమె కడతేర్చినట్టు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య హత్య కేసు వివరాలను వెల్లడించారు.
ఈ నెల 24వ తేదీన కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 ఏళ్ల బాలుడు పందుల మనీష్ కుమార్ మెడకు నైలాన్ తాడుతో బిగించి అతి కిరాతకంగా హత్య చేసిన కసాయి తల్లి శిరీషను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్.... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన శిరీష 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారంలో మద్యం నిప్పులు పోసింది. భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భార్య శిరీష , పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని మొదటి భావించింది. తాను చనిపోతే ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందింది. అందుకే వారిని కూడా చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటే ఇబ్బంది ఉండదని డిసైడ్ అయ్యింది.
ప్లాన్‌లో భాగంగా మొదట 15 జనవరి 2025న చిన్న కుమారుడు రెండేళ్ల నిహాల్‌ను నీటి సంపులో పడేసి కడ కడతేర్చింది. ప్రమాదవశాత్తు జరిగి బాలుడు మృతి చెందినట్టు చిత్రీకరించింది. అందర్నీ అలానే నమ్మబలికించింది. అది అందరూ నమ్మేశారని రెండో కుమారుడి హత్యకు స్కెచ్ వేసింది. 31 జులై 2025న పెద్ద కుమారుడు మనీష్ కుమార్ మెడపై కత్తితో హత్య చేసేందుకు యత్నించింది. కానీ బాలుడు అరవడంతో నానమ్మ లేచింది. దీంతో శిరీష ప్లాన్ వర్కౌట్ కాలేదు. గాయాలతో ఉన్న బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రిలో కోలుకొని ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడిపై ఈనెల 24వ తేదీన హత్యకు స్కెచ్ వేసింది. ఆరోజు సాయంత్రం మనీష్ కుమార్ పడుకొని ఉండగా నైలాన్ తాడుతో మెడకు గట్టిగా చుట్టి హతమార్చింది. తర్వాత ప్రశాంతంగా ఊరిలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. బతుకమ్మ ఆడింది. నానమ్మ ఇంటికి వచ్చి చూడగా మనవడు అచేతనంగా పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు హుటాహుటిన తీసుకొని వెళ్ళింది. ఆర్.ఎం.పి పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందాడని తెలిపాడు.
కుమారుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న తండ్రి వచ్చాడు. కుమారుడు మృతదేహాన్ని గమనించిన మెడపై ఉరి ఆనవాళ్లు కనపడటంతో అనుమానపడ్డాడు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలోవిచారణ చేపట్టగా శిరీష ఇద్దరు కుమారులను హత మార్చిన విషయాలను బయటపెట్టింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రిమాండ్ విధించారు.





















