MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణలో ఎలాంటి కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన రాష్ట్ర పోలీసు యంత్రాంగానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
MLC Kavitha: తెలంగాణలో ఎలాంటి కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత రాష్ట్ర పోలీసు యంత్రాంగానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ప్రజల్లో అనేక అపోహలు ఉండేవని.. ముఖ్యంగా కొత్త రాష్ట్రంలో భద్రత ఉండదు, రౌడీలు ఎక్కువుతారని దుష్ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. కానీ పోలీసులు ఆ అపోహలను పారదోలుతూ.. కర్ఫూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత తెలంగాణ పోలీసులకే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన మహిళా సురక్షా సంబరాల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడ బిడ్డలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. మహిళల కళ్లలో నీరు రావొద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలో అదుపులో ఉండడంతో పాటు పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్నారు. అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నాని కూడా పాల్గొన్నారు.
On the occasion of Telangana Rashtra Dashabdi Utsavalu addressed our women officers of Telangana Police during Mahila Suraksha Sambaralu organised at Tank Bund. #TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/il8rqTg49z
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 4, 2023
హైదరాబాద్ లో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించిందని హీరో నాని తెలిపారు. అలాగే పోలీసులు మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తాను షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషాన్ని కల్పిస్తుందని.. చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.