BRS MLA Rohit Reddy: నన్ను ఇరికించేందుకు కుట్ర - హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో మనీ అనే వ్యవహారం లేదని, కానీ కేవలం బీజేపీ బండారం బయట పెట్టానన్న కారణంతోనే కక్షగట్టి ఈడీ, సీబీఐలను తన మీదకి పంపించారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు.
Rohit Reddy, MLAs Poaching Case: ఈడీ విచారణకు వెళ్లిన తనకు ఏ కేసులో విచారణకు పిలిచారో కూడా అధికారులు చెప్పలేదన్నారు. కేవలం తన బయోడేటా, వ్యక్తిగత వివరాలతో పాటు వ్యాపార లావాదేవీలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు పిలిచినట్లు రెండో రోజు చెప్పారని వెల్లడించారు. అయితే ఈ కేసుతో ఏ సంబంధం లేని వ్యక్తి అభిషేక్ ను సైతం విచారణకు పలిచారు. తన సోదరుడితో ఏదో వ్యాపార లావాదేవిలు జరిపాడని విచారణకు పిలిచారని చెప్పారు. ఈ కేసులో మనీ అనే వ్యవహారం లేదని, కానీ కేవలం బీజేపీ బండారం బయట పెట్టానన్న కారణంతోనే కక్షగట్టి ఈడీ, సీబీఐలను తన మీదకి పంపించారని ఆరోపించారు. ఈడీ విచారణకు ఇచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని రోహిత్ రెడ్డి తెలిపారు.
ఫిర్యాదు చేసిన వారిని మొదట విచారిస్తారా ?
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదు చేసిన బాధితుడినైన తనను మొదట విచారణ చేశారని చెప్పారు. దోషులను, అనుమానితులను పిలవకుండా ఫిర్యాదు చేసిన వారిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారన్నారు. తాను విచారణకు పూర్తిగా సహకరించానని, కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎక్కడా నగదు ప్రస్తావన రాకున్నా.. ఏదో విధంగా తనను లొంగదీసుకోవాలని, తనను భయపెట్టే ప్రయత్నం అని ఆరోపించారు. ఇది గమనిస్తే దొంగే దొంగ అని అరిచినట్లుగా బీజేపీ వ్యవహారం ఉందన్నారు. నందకుమార్ నుంచి వారికి అనుకూలమైన, నాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ రికార్డు చేసి నన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలని కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు ఫిర్యాదుదారులపై, బాధితులపై ఈడీ మొదట విచారణ చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కనుక ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకుంటానని, తనకు న్యాయవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
నన్ను గానీ, నా కుటుంబసభ్యులను గానీ బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నా తాను మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదన్నారు. 8, 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత బీజేపీ సొంతమన్నారు. కానీ తెలంగాణలో బీజేపీ వాళ్ల పప్పులు ఉడకలేదన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఆరోజు బీజేపీ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లుగానే, నేడు మరోసారి వారి ప్రయత్నాలను తిప్పి కొడతామన్నారు. నందకుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ల తారుమారు చేసి, తనను ఈ కేసులో ఎలాగైనా సరే ఇరికించే కుట్ర జరగుతోందని ఆరోపించారు. బంగారు తెలంగాణలో సంక్షేమాన్ని చూడలేక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమకు వీలు కాదని భావించి కేంద్రంలోని బీజేపీ తమపై కక్ష గట్టిందని ఆరోపించారు.
నందకుమార్ ఈడీ విచారణకు కోర్టు అనుమతి!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్ ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుంది. సిట్ దర్యాప్తు చేస్తుండగా... ఈడీ కూడా విచారణ చేపట్టింది. మొయినాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ను నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సెవెన్‌హిల్స్ మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్ ఆవాలాను ఈడీ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఒక రోజు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 26న నందకుమార్ ను ఈడీ అధికారులు విచారించునున్నారు. చంచలగూడా జైల్లో నందకుమార్ స్టేట్మెంట్ నమోదు చేయనున్నారు.