అటుకులు బుక్కిన KCR వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకున్నారు?: ఎమ్మెల్యే ఈటల
Bandi Sanjay Arrest: పేపర్ లీకేజీ పేరిట బండి సంజయ్ ను అరెస్టు చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుందన్నారు.
Bandi Sanjay Arrest: పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ పేరు చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ లోని ఆయన నివాసంలో బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ ప్రజల పక్షాన ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యం, ప్రభుత్వం శాశ్వతం కాదని.. త్వరలోనే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. టీఎస్పీఎస్సీ బోర్డుని రద్దు చేసి పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశం అంతా డబ్బులు ఖర్చు పెడతా అని కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంతగా తెలంగాణ ప్రజలను కొల్లగొట్టారు అర్థం చేసుకోవాలని అన్నారు. అలాగే లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని మీరే నిరూపించుకోవాలని సూచించారు.
టీఎస్పీఎస్సీ అభాసుపాలై 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిందన్నారు. దీనికి పూర్తి భాధ్యతను సీఎం కేసీఆర్ వహించాలని డిమాండ్ చేస్తునట్లు ఎమ్మెల్యే ఈటల తెలిపారు. ఒకపక్క పేపర్ లీకేజీ, మరోపక్క మహిళలు చేయకూడని లిక్కర్ బిజినెస్ లో కూతురు అడ్డంగా దొరికిపోయి విచారణ ఎదుర్కుంటుందని అన్నారు. హిందీ పేపర్ లీకేజీ విషయంలో సీపీ రంగనాథ్ చాలా క్లియర్ గా సమాచారం ఇచ్చిన తరువాత దానిని బండి సంజయ్ కి ఆపాదిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనినుండి ప్రజలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రజలకు తెలిపారు. రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పినట్టు.. అటుకులు బుక్కిన కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకున్నారు తెలపాలని ప్రశ్నించారు. విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించి ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తూ.. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్యం అందించేందుకు డబ్బు లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దేశంలోని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ ఫండింగ్ ఇస్తానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు ఈటల.
బీజేపీలో విద్యావంతులు లేరని కొందరు అంటున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మోదీ చాలా ఏళ్ల నుంచి విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ స్వీయ ప్రేరణ పొందుతున్నారన్నారు. మోదీ విశాలంగా ఆలోచించి ఆ పని చేస్తున్నారు కాబట్టే పిల్లలతో మమేకమవుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో పేపర్ లీకేజీలపై విచారణ జరిపించాలని అన్నారు. ప్రియమైన ప్రజలారా.. కేసీఆర్ చేస్తున్న పనులపై చర్చ పెట్టండని చెప్పారు. అప్పుడే నిజం ఏంటో తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఓటమితోనే ఈ చెడు మార్గాలకు ముగింపు లభిస్తుందన్నారు. ఇది దోపిడీకి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం అని ఈటల వ్యాఖ్యానించారు. రాష్ట్రం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు వస్తున్నందున ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఎమ్మెల్యేలు వచ్చి మందు, మధ్యాహ్న భోజనంలో మటన్ అందిస్తున్నారని విమర్శలు గుప్పించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, పింఛన్, రుణమాఫీ వంటివి కేవలం ఆహ్వానం ఇస్తే రావని... కేసీఆర్ మీకు ఎందుకు తాగిస్తున్నారో, మటన్ మీల్స్ ఎందుకు అందిస్తున్నారో ఆలోచించండని సూచించారు.