Vemula Prashanth Reddy: రేవంత్, ఈటల కలిసిన ఫోటోలు బయటపెడతా, రాహుల్ నిజంగా పప్పే! -మంత్రి వేముల
బీఆర్ఎస్ శాసన సభ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
బీజేపీకి మీరంటే మీరే బీ టీమ్ అని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్ఫరంగా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. అందుకు తాను ఆధారాలు కూడా బయట పెడతానని చెప్పారు. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం అయ్యారని అన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు చూపించాలా? అని అడిగారు. బీఆర్ఎస్ శాసన సభ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీని చాలా మంది పప్పు అని పిలుస్తుంటారని, అందుకు ఆయన తగిన వ్యక్తే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి అవగాహన లేదని, ఏం తెలియకుండా మాట్లాడారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్న పథకాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. రాహుల్ గాంధీ ఓ రిమోట్ గాంధీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాసి ఇచ్చిన స్ర్కిప్టును రాహుల్ గాంధీ చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ హోదా ఏంటో తెలియదని అన్నారు. గతంలో తెలంగాణ కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ పరిపాలించిందని, మరి అప్పుడు పింఛన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్ పథకాలు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
‘‘దేశంలో అవినీతికి అర్థం కాంగ్రెస్ పార్టీ.. స్కామ్ లకు రారాజులు కాంగ్రెస్ పార్టీ. రాహుల్‌గాంధీ నిజంగా పప్పే.. 80 వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది. రాహుల్ గాంధీ మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో 4000/- రూపాయల పెన్షన్ చేసి చూపెట్టి తెలంగాణలో మాట్లాడాలి. ఇక్కడ కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్ రాహుల్ చదివి వెళ్లిపోయారు. వచ్చామా మాట్లాడామా పోయామా అన్నట్టు ఉంది రాహుల్ తీరు. రాహుల్ కు అవగాహన లేదు పరిజ్ఞానం లేదు.
కేసీఆర్ ది రాచరికం కాదు.. రాజు కారు.. 88 సీట్లు గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. రాహుల్ ఎంపీగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని స్కాములే.. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని స్కీములే. తెలంగాణ కు మొదట్నుంచి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా. వందలాది మంది తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? 2004 లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత మంది చనిపోయేవారు కాదు. విధి లేని పరిస్థితుల్లోనే అనివార్యంగా కాంగ్రెస్ పదేళ్లు ఆలస్యంగా తెలంగాణ ఇచ్చింది. రాష్టం పదేళ్లు ఆలస్యం కావడం వల్ల తెలంగాణ అభివృద్ధి వెనక్కు వెళ్లింది. దానికి కాంగ్రెస్ కారణం కాదా? మేము ఎవ్వరికీ బీ టీం కాదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పని చేశాయి. కావాలంటే ఈటల రేవంత్ హోటల్లో కలుసుకున్న ఫోటోలు రాహుల్ కు పంపిస్తా’’ అని ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.