Sabitha Indra Reddy: నార్సింగి విద్యార్థి ఘటనపై మంత్రి సబిత కీలక నిర్ణయం - ఆయనకు ఆదేశాలు
నిన్న రాత్రి (ఫిబ్రవరి 28) నార్సింగిలోని కాలేజీ హస్టల్ వద్దకు వెళ్లి సాత్విక్‌ను తండ్రి రాజు కలిశారు. మూడు రోజులుగా సాత్విక్ తనను రావాలని కోరినట్టుగా రాజు గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ శివారులోని నార్సింగి శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థి చనిపోవడంపై విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పాత్రపై విచారణ చేయించాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిత్తల్‌ను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని ఆదేశించారు. బాధ్యులను గుర్తించి దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
విద్యార్థులు ఎవరూ మార్కులే ప్రధానంగా జీవించకూడదని, మార్కులు జీవితాలను నిర్ణయించవని మంత్రి అన్నారు. పరీక్షల్లో కనీసం పాస్ మార్కులు తెచ్చుకున్నా సరిపోతుందని, ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోవడం సరికాదని చెప్పారు. కళాశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులను మార్కులు సాధించే ర్యాంకుల మెషీన్లుగా భావించొద్దని హితవు పలికారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని చెప్పారు. మానసికంగా హింసించొద్దని సూచించారు.
నిన్న రాత్రే కలిసిన తండ్రి
నిన్న రాత్రి (ఫిబ్రవరి 28) నార్సింగిలోని కాలేజీ హస్టల్ వద్దకు వెళ్లి సాత్విక్‌ను తండ్రి రాజు కలిశారు. మూడు రోజులుగా సాత్విక్ తనను రావాలని కోరినట్టుగా రాజు గుర్తు చేసుకున్నారు. అతనికి అవసరమైన మందులు కూడా తీసుకెళ్లి ఇచ్చానని, చెప్పారు. అప్పుడే తల్లితో, తన అన్నతో ఫోన్ లో కూడా మాట్లాడించినట్లుగా చెప్పారు. మీరు ఇంటికి వెళ్లండి.. నేను భోజనం చేసి పడుకుంటానని చెప్పిన సాత్విక్ శాశ్వతంగా నిద్రలోకి వెళ్లాడని సాత్విక్ తండ్రి చెప్పారు.
తాగను తన కొడుకుతో మాట్లాడి ఇంటికి వచ్చిన రెండు గంటలకే సాత్విక్ కు సీరియస్ అంటూ స్నేహితుల నుంచి ఫోన్ వచ్చిందని రాజు వాపోయారు. తనతో మాట్లాడే సమయంలో సాత్విక్ కొంత డిప్రెషన్ లో ఉన్నట్టుగా అనిపించిందని అన్నారు. అదే విషయం అడిగితే అలాంటిదేమీ లేదని తనకు సమాధానం ఇచ్చాడని చెప్పారు.