(Source: ECI/ABP News/ABP Majha)
Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల
Minister Prashanth: మంత్రి వేముల ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించిన న్యాక్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో.. దళితబంధు లబ్ధిదారుల అందరికీ ఎక్విప్ మెంట్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
Minister Prashanth: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధును అమలు చేస్తోంది. ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ పది లక్షల రూపాయలతో వారు సొంత వ్యాపారం చేసుకుంటూ.. మరో నలుగురికి ఉపాధి కల్పించేలా.. దళితులను వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలను చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగతా వర్గాల నుండి ఎంత వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా.. ఈ విషయంలో ముందుకే వెళ్తోంది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం.
ప్రతిష్టాత్మకంగా దళితబంధు..
కనీవినీ ఎరుగని రీతిలో రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు రాష్ట్ర సర్కారు. ప్రభుత్వం అందిస్తున్న ఆ మొత్తంతో ఎలాంటి వ్యాపారాలు పెట్టుకోవాలి. ఎలాంటి పనులు చేస్తే మంచి ప్రయోజనం చేకూరుతుందో.. దళిత బంధు లబ్ధిదారులకు వివరంగా చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ పనులు చేయాలో తెలియని వారికి.. అధికారులే తగిన సూచనలు చేస్తున్నారు. ఒకటి, రెండు, మూడు యూనిట్లు కలిపి ఏదైనా పెద్ద వ్యాపారాన్ని, పెద్ద వాహనాన్ని కొని ఇస్తున్నారు.
30,625 మందికి శిక్షణ..
అందులో భాగంగానే... దళితబంధు లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన న్యాక్ క్యాంపస్ లో న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. దళిత బంధు లబ్ధిదారులకు ఎక్విప్ మెంట్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎక్విప్ మెంట్ ఆపరేటర్ శిక్షణ వల్ల దళిత బంధు లబ్ధిదారుల్లో నైపుణ్యాలను పంపొందించవచ్చనే అభిప్రాయాన్ని న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వ్యక్తం చేసింది. 2022-23 సంవత్సరంలో 30 వేల 625 మందికి ఈ శిక్షణ ఇవ్వాలని కార్యాచరణ రూపొందించారు.
నిర్మాణ, ఐటీ, సేవల రంగాల్లో శిక్షణ..
పలు ఇంజినీరింగ్ విభాగాల్లో 20 శాతం మంది వర్కింగ్ ఇంజినీర్లకు స్వల్ప కాలిక శిక్షణలు.. అదే విధంగా 2022-23 సంవత్సరంలో టీఎస్ పీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతున్న ఇంజినీర్లు, టెక్నికల్ పర్సన్స్ కు... 30 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ను నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. యువతకు నైపుణ్యాలు నేర్పించేందుకు జిల్లాల్లో న్యాక్ శిక్షణ కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున దశల వారీగా స్కిల్ సెంటర్స్ ను నిర్మించాలని నిర్ణయించారు. గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లే యువత ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను మొదట నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. న్యాక్ శిక్షణ కేంద్రాలు నిరుద్యోగ యువతకు నిర్మాణం, ఐటీ, సేవల రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నాయి.
ఆడిట్ నివేదికలకు ఆమోదం..
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. 11 జిల్లా శిక్షణా కేంద్రాలకు అధునాతన శిక్షణ పరికరాల సేకరణకు రూ. 1.32 కోట్లు మంజూరు చేసింది. అలాగే న్యాక్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతాన్ని రెండు స్పెల్స్ లో పెంచేందుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు.