(Source: ECI/ABP News/ABP Majha)
Telangana News: అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు- ప్రజలకు మంత్రి పొన్నం సూచన
Telangana News: వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం 24X7 ప్రయత్నిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్‌లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లోని వరద ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హిమాయత్ సాగర్ జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. మరో రోజు వర్షాలు పడినా హిమాయత్ సాగర్ జలాశయం నిండిపోతుందన్నారు. జలాయశయం నిండితే కింద ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ,రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు. మరో 5 వేల క్యూసెక్కుల నీళ్ళు వస్తే ఓవర్ ఫ్లో అవుతుందన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తోందని వివరించారు.
రాజకీయం చేయొద్దు
విపత్కార సమయంలోరాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. రాజకీయాలు అసెంబ్లీ వేదికగానో,ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని సలహా ఇచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఫార్మ్ హౌస్‌లో ఉండి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు. విపత్తుల సమయంలో జరిగిన మరణాలు ప్రమాదవశాత్తు జరిగాయని తెలిపారు. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినవి కావన్నారు. వారిని ఆదుకోవడానికి 5 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు అందరినీ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ యంత్రంగా 24 గంటలు పని చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని వివరించారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
జాతీయ విపత్తుగా గుర్తించి భారీగా నిధులు కేంద్రం రిలీజ్ చేసేలా బీజేపీ కృషి చేయాలని సూచించారు. తక్షణం సాయం కింద 2000 కోట్లు అందించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్న్నారు. గతంలో ఇలాంటి ప్రకృతిలు వస్తే ప్రజలకు ఎలాంటి సాయం చేయని పరిస్థితి ఉండేదని ఆరోపించారు. కొండగట్టులో 69 మంది చనిపోతే కనీసం ఒక్కరూ కూడా వచ్చి పరమర్శించని దుస్థితి ఉండేదన్నారు. మానవీయ కోణం లేని బీఆర్‌ఎస్ నేతలు తమను విమర్శించడం ఏంటని నిలదీశారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
ముఖ్యమంత్రి ఖమ్మం వెళ్లి అక్కడ పర్యటించి రాత్రి అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. ఉదయం మహబూబాబాద్ వచ్చారని పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు పెట్టుకోవాలన్నారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి పాఠశాలకు సెలవులు ప్రకటించాలని అధికారులకు సూచించారు. 33 జిల్లా కలెక్టర్లు, గ్రామ కార్యదర్శి మొదలు సిఎస్ వరకు అంతా రాత్రీపగలు పని చేస్తున్నారన్నారు.
అధికారులు, నేతలంతా ప్రజల్లోనే...
ఎక్కడైనా ఆపద ఉన్న విపత్తు కలిగితే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మేల్యేలు,ఎంపీలు అందరూ ప్రజల్లోనే ఉన్నారని వివరించారు. రాజకీయాలు అవసరం లేదన్న ఆయన... అందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. జరిగిన నష్టంపై కేంద్రాన్ని నిలదీద్దామన్న ఆయన... బడ్జెట్ లా మొండి చేయి చూపకుండా సహకరించాలన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.
Also Read: వరద బాధితులకు విరాళాల వెల్లువ- ఎవరెవరు ఎంత ఇచ్చారంటే?