Minister Mallareddy: కుమారుడిని డాక్టర్ చేస్తే, గిఫ్టుగా మరో డాక్టర్ కోడలుగా వచ్చింది - రెడ్డి అమ్మాయితో పెళ్లి చేసింటే ?
Minister Mallareddy: కుమారుడిని డాక్టర్ చేస్తే గిఫ్టుగా మరో డాక్టర్ కోడలుగా వచ్చిందని, ఆమెను కాదని రెడ్డి అమ్మాయిని కోడలుగా చేసుకుని ఉంటే పార్టీల వెంట తిరిగేదని మంత్రి మల్లారెడ్డి కామెంట్లు చేశారు.
Minister Mallareddy: నిన్న మొన్నటివరకు ఐటీ, ఈడీ దాడులతో వార్తల్లో నిలిచిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన కుమారుడిని డాక్టర్ చేస్తే.. తనకు మరో డాక్టర్ కోడలుగా వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. అదే తన కుమారుడికి ఆ అమ్మాయితో కాకుండా మరో అమ్మాయితో పెళ్లి చేసుంటే.. కిట్టీ పార్టీలు, పిక్నిక్ లు అంటూ తిరిగేదని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. ఓ కళాశాల కార్యక్రమానికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి... పుట్టిన రోజులు, పిక్నిక్ లు లాంటివి ఉండొద్దని, ఇలాంటి వాటివి చేస్తూనే తల్లిదండ్రులు పిల్లలను పాడు చేస్తున్నారని అన్నారు. కొన్ని సాధించాలంటే కొన్నింటికి వారిని దూరంగా ఉంచాలన్నారు. ప్రేమ, స్నేహం అన్నింటికీ దూరంగా ఉండాలని చెప్పారు. పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచితే అంత మంచి స్థాయికి వస్తారని మంత్రి వెల్లడించారు. విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు.
భూమి అమ్మి మరీ నా కొడుకును ఎంబీబీఎస్ చదివించాను...
భూమి అమ్మి మరీ కుమారుడిని ఎంబీబీఎస్ చదివించానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని... తనకు ఎలాంటి కోరికలు లేవన్నారు. కుమారుడిని డాక్టర్ చేస్తే... మరో డాక్టర్ తనకు కోడలుగా వచ్చిందన్నారు. అలా కాదని తాను రెడ్డి అమ్మాయిని కుమారుడికి ఇచ్చి చేసుంటే పార్టీలు, ఫంక్షన్ల వెంట తిరిగేదన్నారు. తన కోడలుకు అమ్మా, నాన్నలు లేరని.. తన కోడలు తనకు మూడో కుమారుడిలాగా అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
ఐటీ దాడులపై స్పందిస్తూ...
ఇటీవలే తనపై జరిగిన ఐటీ దాడుల గురించి మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన దగ్గర ఏం దొరక్కపోవడంతో ఐటీ అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తనది ఓపెన్ హార్ట్ అని, మనసులో ఏం దాచుకోనని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో అంతా ఆన్ లైన్ లోనే సిస్టమ్ నడుస్తోందని.. తామెక్కడూ డొనేషన్లు వసూలు చేయలేదని మంత్రి వెల్లడించారు. మొత్తం 400 మంది ఐటీ అధికారులు దాడులు చేశారని.. వారందరికీ ఏమీ దొరక్క అనవసర ఆరోపణలు చేసి వెళ్లిపోయారన్నారు. తాను ఏం తప్పు చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.
అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చామన్న మల్లారెడ్డి కుమారుడు..
మల్లారెడ్డి చిన్న కూమారుడప చామాకూర భద్రా రెడ్డి కూడా ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని ప్రకటించారు. తమతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మంది సిబ్బందిని విచారణ చేశారని.. తమ స్టేట్మెంట్లతో పాటు మా కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లు రికార్డు చేశారన్నారు. అవసరం అనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారని.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని ఆదేశించారన్నారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మాట్ లోనే వివరాలు ఇవ్వాలన్నారని.. అధికారులు అడిగిన ఫార్మేట్ లో మేము పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.