Malla Reddy: ఐటీ విచారణ: మంత్రి మల్లారెడ్డికి బదులుగా ఆడిటర్ హాజరు, కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు
నేటి విచారణకు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. అయితే, తన స్థానంలో తన ఆడిటర్ విచారణకు వస్తారని మల్లారెడ్డి అధికారులను కోరారు.
Minister Malla Reddy IT Raids Issue: తెలంగాణ మంత్రి మల్లా రెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారంలో నేడు విచారణ జరగనుంది. ఆమేరకు మల్లా రెడ్డి ఆడిటర్ శివకుమార్ కీలక పత్రాలు, ఆధారాలతో ఐటీ ఆఫీసుకు వచ్చారు. ఆ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని మల్లా రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. నేటి విచారణకు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. అయితే, తన స్థానంలో తన ఆడిటర్ విచారణకు వస్తారని మల్లా రెడ్డి అధికారులను కోరారు. తాను మంత్రిగా ఉప్పల్‌లో జరిగే కొన్ని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. అందుకే ఐటీ విచారణకు వెళ్లలేకపోతున్నాని అన్నారు.
మల్లా రెడ్డికి (Minister Malla Reddy) అల్లుడు అయిన మర్రి శశిధర్ రెడ్డికి కూడా ఐటీ నోటీసులు అందగా తాను మాత్రం విచారణకు వస్తానని చెప్పారు. తనకు అందిన నోటీసుల్లో హాజరు కావాలని మాత్రమే ఉందని, ఎటువంటి పత్రాలు, ఇతర వివరాలు తీసుకొని రావాలని సూచించలేదని అన్నారు.
ఐటీ శాఖ అధికారులు 16 మందికి నోటీసులు ఇవ్వగా 12 మంది విచారణకు వచ్చారు. మంత్రి మల్లా రెడ్డి కుమారుడు భద్రా రెడ్డి ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మంత్రికి కూడా నోటీసులు ఇవ్వగా ఆయన తరపున తన చార్టెడ్ అకౌంటెంట్ శివకుమార్ ని పంపారు. ఇక మల్లా రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా హాజరు అయినట్లు తెలుస్తోంది.
ఇక మర్రి లక్షారెడ్డి, నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ నర్సింహారెడ్డి, ఆయన కుమారుడు త్రిశూల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మల్లా రెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి అధికారులు ఇచ్చిన నోటీసు తీసుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రామస్వామి రెడ్డి సైతం విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు ఐటీశాఖ ఎదుట 12 మంది హాజరు కాగా సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలపై ప్రశ్నిస్తున్నారు.
ఆరు రోజుల క్రితం మంత్రి మల్లా రెడ్డి ఇల్లు, కార్యాలయాలు సహా బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లా రెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడికు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేశారు. ఏకంగా 60 టీమ్‌లు రెండు రోజుల పాటు రాత్రీ పగలు షిఫ్టుల వారీగా సోదాలు చేశాయి. ఈ సోదాల్లో పత్రాలతోపాటు భారీగా నగదును కూడా సీజ్ చేశారు. ఇంట్లో భారీగా నగదుతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 28న విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లా రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగులు సహా 16 మందికి నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణకు పూర్తిగా సహకరిస్తానని మల్లా రెడ్డి అప్పుడే ప్రకటించారు. ఈ విచారణకు ఈ రోజు మల్లా రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు కూడా హాజరుకానున్నారు.