Harish Rao: ప్రభుత్వాలను కూలగొట్టిండ్రు, మీరు మాట్లాడతరా? కిషన్‌రెడ్డికి మంత్రి హరీశ్ కౌంటర్
తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్లు వేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ విజయవంతమైందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కాలి నడకన సభకు వచ్చి ఆశీర్వదించారని అన్నారు. నిన్నటి సభతో గెలుపు టీఆర్ఎస్ దే అని స్పష్టమయిందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టి మనుషుల్లో కృతజ్ఞత భావం ఉంటుందని, తమకు సాయం చేసిన వారికి అండగా ఉంటామని నిన్నటి సభ ద్వారా రుజువయిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్లు వేశారు.
‘‘అబద్దాలు ఆడటం బీజేపీ డీఎన్ఏగా మారింది. రాజ్యంగ బద్ద పదవిని, వారి స్థాయిని మరిచి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలడం జరిగింది. సీఎం సభ తర్వాత బీజేపీ నేతల దిమ్మతిరిగింది. వారు గల్లీ రాజకీయ నాయకుల మాదిరి దిగజారి మాట్లాడారు. కేంద్ర మంత్రి మాట్లాడినట్లు, రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లు వారి మాట తీరు లేదు. చిల్లర, దివావాళాకోరు, దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నరు. ఢిల్లీ దూతల వల్ల వీరి స్థాయి ఏంటో అర్థమయింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు అంత సినిమా లేదని, ఢిల్లీ పెద్దలు మమ్మల్ని పంపారని చెప్పడం విన్నాం. ఏదైనా ఉంటే మాతో నేరుగా మాట్లాడాలని ఢిల్లీ దూతలు చెప్పడం విన్నాం
ప్రజాస్వామ్యంలో ఇలాంటి నేతల మాటలు వింటే ప్రజలు నమ్మకం కోల్పోతారు. పచ్చి అబద్దాలు మాట్లాడారు. సాక్షాధారాలతో నేను మాట్లాడుతున్నా. సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతూ 8 ఏళ్లలో ఏం చేయలేదు. 15 రోజుల్లో చేస్తరని అంటున్నడు. పోదం పద మునుగోడుకు. 99 శాతం మునుగోడు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాల ఫలాలు అందాయి. ఏ అక్కను అడిగినా, చెల్లెనడిగినా చెబుతుంది శుద్ధి చేసిన కృష్ణా నీరు ఇంటింటికి అందుతుందని. మొన్న ఒక్క చెల్లే చెబుతోంది నాలుగేళ్లు అయింది భుజం మీద బిందెలు ఎత్తుకోవడం మానేసి అని.
‘‘మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నరు. వందల కోట్ల ఆస్తి చూపినా వారు గడ్డిపోచలా వదులుకుని రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డారు. రాజ్యాంగ నిబంధనల మేరకు వాళ్లు మా పార్టీలో విలీనమయ్యారు తప్ప మీలా ప్రభుత్వాలను కూలగొట్ట లేదు. పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వళ్లించడమే. ఈడీలను, బోడీలను చూపించి బెదిరించి ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటరు. ప్రభుత్వాలు పడగొడ్తరు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లను మీరు విలీనం చేసుకున్నరు కదా. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో విలీనం అయితే తప్పేంటి. మీరు విలీనం చేసుకోవచ్చు. మేం చేస్తే తప్పా’’
‘‘మొన్న గుజరాత్ లో 8 మంది ఎమ్మెల్యేలు, సిక్కింలో 13 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నరు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా,సిక్కిం ఇలా 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గద్దెనెక్కిన ప్రభుత్వాలను కూలగొట్టిండ్రు. మీరు రాజకీయాల కోసం మాట్లాడతరా. మీకు నైతిక హక్కు ఉందా.
మోటర్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడన్నా ఉందా.. కేంద్ర మంత్రి అలా మాట్లాడతరా మీ ప్రభుత్వాన్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నరు. కేంద్ర ఆర్థిక శాఖ, మా ఆర్థిక శాఖకు పంపిన లేఖలో బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెట్టాలని పేజీ నెంబర్ 2లో కాలమ్ నెంబర్ 2 లో చూడండి. 0.5 ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇవ్వాలంట ఈ కండిషన్స్ ఫుల్ ఫిల్ చేయాలని చేస్తే ఏడాదికి ఆరు వేల కోట్లు ఇస్తాం. ఐదేళ్లకు 30 వేలకోట్లు ఇస్తం అన్నరు.
0.5 ఎఫ్ఆర్బీఎం రావాలంటే ఫుల్ మార్క్స్ అగ్రికల్చర్ కనెక్షన్ అంటే ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే 20 కి 20 మార్కులు వేస్తం. మీ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇవ్వద్దు. మూడో పేజీలో చూస్తే రైతు తనకు కేటాయించిన పరిమాణం కంటే తక్కువ కరెంటు వాడితే అతనికి బహుమానం ఇవ్వండి. మీటర్ పెట్టి కోటా పెట్టి, ఆ కోటా కంటే తక్కువ కరెంటు వాడితే ఇన్సెంటీవ్ ఇవ్వండని కేంద్ర ఆర్థిక శాఖ నుండి రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపిన లేఖ ఇది.
ప్రాణం ఉన్నంత వరకూ మీటర్లు పెట్టబోం
కేసీఆర్ గారు తాను గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీలో చెప్పారు. వీళ్లు మేం మీటర్లు పెట్టమని ఎక్కడ చెప్పినం అని సంజయ్, కిషన్ రెడ్డి అంటున్నరు. ఇవిగోసాక్ష్యాలు. కాగితాలు. పక్క రాష్ట్రంలో మీటర్లు పెట్టలేదా.. డబ్బులు తెచ్చుకోలేదా.. ఇప్పుడు మీరు తల ఎక్కడ పెట్టుకుంటరు సంజయ్, కిషన్ రెడ్డి. మీటర్లు పెట్టకుండా రైతుల పక్షాన నిలబడ్డడు కేసీఆర్. రైతుల మెడలో ఉరితాడు పెట్టాలని చూసింది బీజేపీ.
మునుగోడు రైతులు మీకు కర్రు కాల్చి వాత పెడ్తరు. కేంద్ర మంత్రివే కదా కిషన్ రెడ్డి. మీటర్లు పెట్టేదే లేకపోతే మరి మాకు రావాల్సిన 30 వేల కోట్లు ఇవ్వు. గత ఏడాది, ఈ ఏడాదికి కలిపి 12 వేల కొట్లుతే. ఎందుకు 12 వేల కోట్లు ఆపారు మరి. అబద్దాన్ని వంద సార్లు చెప్పి పదే పదే బీజేపీ నేతలు మాట్లాడతున్నరు. ఈ నిజం రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు తెలియాలి. రైతులకు ఉరితాడు వేయాలని బీజేపీ చూస్తే, 35 వేల కోట్లు కాదని మీటర్లు పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్’’ అని హరీశ్ రావు మాట్లాడారు.