Harish Rao: నీళ్లు లేవా, లక్ష కోట్ల ధాన్యం ఎలా పండింది? మీ మాటల్లో విషం తప్ప విషయం లేదు - హరీష్ రావు కౌంటర్
Harish Rao: విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపైనా హరీశ్‌రావు మాట్లాడారు.
ఈ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు ఏం చేస్తారో ఒక్క నాయకుడు కూడా చెప్పలేదని మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడికి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారని, వాళ్ల రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయని ఒక్క సీఎం అయినా చెప్పగలిగారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని అన్నారు. ఒకసారి చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. సోమవారం మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలతో తన స్థాయిని దిగజార్చుకోవద్దని అన్నారు. విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపైనా హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలోకి నీళ్లు వచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నీళ్లు ఎలా వచ్చాయో ఇక్కడి రైతులను అడిగితే చెబుతారని అన్నారు. నీళ్లు వచ్చాయనేందుకు పండిన పంటలే నిదర్శనమని అన్నారు. లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని మీరే చెప్పారని, నీళ్లు లేకపోతే అవి ఎక్కడి నుంచి వస్తాయని సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాస్త తమ హయాంలో 2.60 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అయిందని గుర్తు చేశారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి పండించేది.. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన నీతి అయోగ్ చెప్పినట్లు గుర్తుచేశారు. తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును మీరు చదివారని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్ విమర్శించారు.
‘‘ఏడాదికి 2 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ గతంలో మేనిఫెస్టోలో చెప్పింది. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. తెలంగాణలో ఖాళీలన్నీ మేం భర్తీ చేస్తున్నాం. ప్రధాని ప్రసంగంలో కూడా అబద్ధాలే చెప్పారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ 26 లక్షల కుటుంబాలకే వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ మాత్రం 86 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం. 8 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకురావట్లేదు’’ అని హరీశ్‌రావు నిలదీశారు.
Addressing the Press Conference at TRSLP https://t.co/39eNeFqFSc
— Harish Rao Thanneeru (@trsharish) July 4, 2022