Medchal District: షాపూర్ నగర్‌లో మెగా డ్రంక్ అండ్ డ్రైవ్, 32 మందిపై కేసు
Medchal District: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, షాపూర్ నగర్‌లో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 32 మంది ద్విచక్ర వాహనదారులపై కేసు పెట్టారు.
Medchal District: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, షాపూర్ నగర్ లో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు పోలీసులు డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బాలానగర్ ఏసీపీ చంద్రశేఖర్, బాలానాగర్, జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ పోలీసులు సంయుక్తంగా షాపూర్ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు ఎస్సైలు, 40 మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించారు. మూడు చోట్ల నిర్వహించిన మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో.. కేవలం అరగంట వ్యవధిలోనే మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 32 మందిని పట్టుకున్నారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వారికి, జైలుకు వెళ్లినా తీరు మార్చుకోని వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
లైకుల కోసం బైక్ స్టంట్లు
హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇటీవల బైక్ స్టంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా అర్థరాత్రిళ్లు చాలా మంది యువకులు.. అక్కడి రోడ్లపై ప్రమాదకర రీతిలో బైకులతో స్టంట్లు చేస్తున్నారు. నిల్చొని, బైకును వదిలేసి, ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకొని.. ఇలా తమకు నచ్చినట్లుగా సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు ఇలాగే సామాజికి మాధ్యమాల్లో లైకుల కోసం బైకుపై స్టంట్లు చేశాడు. సీసీ కెమెరాల ద్వారా విషయం గుర్తించిన ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. వాహనం నెంబర్ సాయంతో యువకుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మరీ అతడిపై కేసు నమోదు చేశారు. ఇంకోసారి ఇలా చేయొద్దంటూ అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ యువకుడితోనే.. మరోసారి నేను ఇలా చేయను.. ఇంకెవరు స్టంట్లు చేయొద్దని కోరుతున్నానంటూ అందరికీ చెప్పించారు. లైకులు, ఎంజాయ్ మెంట్ వంటి వాటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయరాదని పోలీసులు చెబుతున్నారు. ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్నారు. ఇలా స్టంట్లు చేయడం వల్ల చేసే వారితో పాటు అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో ప్రతీది రికార్డు అవుతుందని... బైకులతో స్టంట్లు చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకనుంచి ఎవరు కూడా ఇలా చేయకూడదని పేర్కొన్నారు.
ఇటీవల ముంబయిలోనూ ఇలాంటి ఘటనే
అయితే తాజాగా ముంబయిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు ముందూ వెనక అమ్మాయిలను కూర్చోబెట్టుకొని... బైక్ పై స్టంట్లు చేశాడు. దీన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా... వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన ముంబయి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఈ బైక్ రైడ్ ఎక్కడ జరిగిందో గుర్తించారు. అలాగే ప్రమాదకరంగా స్టంట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులు బైక్ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు.