Mahesh Bank: మహేశ్ బ్యాంకు హ్యాక్ అయింది వారివల్లే, విచారణ ఖర్చే 58 లక్షలు - CP వెల్లడి
Mahesh Bank: మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు వివరాలను బుధవారం సీపీ సీవీ ఆనంద్ వివరించారు.
హైదరాబాద్‌లో మహేశ్ బ్యాంకును హ్యాక్ చేసిన కేసును నగర పోలీసులు ఛేదించారు. దాదాపు 2 నెలలపాటు, 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. మామూలుగా కేసుల విచారణ కోసం నామమాత్రపు ఖర్చులు అవుతుండగా, ఈ కేసుకు మాత్రం ఎప్పుడూ లేనంతగా 58 లక్షలు ఖర్చు అయిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు వివరాలను బుధవారం సీపీ సీవీ ఆనంద్ వివరించారు.
సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘నవంబర్ నెలలో మహేష్ బ్యాంకుకు చెందిన 200 మంది ఉద్యోగులకు హ్యాకర్ ఫిషింగ్ మెయిల్స్ పంపాడు. ఇద్దరు ఉద్యోగులు మెయిల్ ఓపెన్ చేయగానే హ్యాకింగ్‌కు వీలు పడింది. మహేష్ బ్యాంక్‌ను సింగిల్ నెట్వర్క్‌తో నడిపిస్తున్నారు. అసలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకే నెట్ వర్క్ వాడకూడదు. బ్యాంకింగ్ వ్యవస్థకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ, మహేష్ బ్యాంక్ అలాంటిది ఏర్పాటు చేసుకోలేదు.
మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల హ్యాకింగ్ చేయడం సులువైంది. ఏడుగురు ఖాతాదారులను సంప్రదించి 10 శాతం కమిషన్‌కు నగదు బదిలీలు జరిగాయి. ఏడు అకౌంట్స్, 115 అకౌంట్స్, అక్కడి నుంచి 300 ఖాతాలు తెరిపించారు. ఫిషింగ్ మెయిల్స్ స్విట్జర్లాండ్- వేరే వేరే దేశాల్లో చూపిస్తున్నాయి. ఐపీ అడ్రస్ లు కెనడా నుంచి పాట్నా - పాట్నా నుంచి యూకే అని ఫేక్ అడ్రస్ లు చూపిస్తున్నాయి.
ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ నుంచే సాఫ్ట్ వేర్ తయారీ
ఢిల్లీలో ఉన్న ఇంట్రా సాఫ్ట్ అనే కంపెనీ చాలా బ్యాంకులకు సాఫ్ట్ వేర్ తయారు చేసి ఇస్తుంది. కానీ వారు సరైన సైబర్ సెక్యూరిటీ లేకుండా అందిస్తున్నారు. ఈ కేసులో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అనేది కూడా తేలుస్తాం. వారికి నోటీసులు ఇచ్చి విచారణ పక్కాగా చేస్తాం.
కొంత మంది ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో బ్యాంకులను నడుపుతున్నా.. వారు నిబంధనలు పాటించక పోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసిన ప్రధాన హ్యాకర్ మన దేశంలో లేడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. మొత్తం 24 మంది హ్యాకర్ లను అరెస్ట్ చేశాం. స్టీఫెన్ ఒర్జీ సెకెండ్ లెవల్ హ్యాకర్‌ను అరెస్ట్ చేశాం. ఐపీ అడ్రెస్‌లతో ఉన్న ప్రధాన హ్యాకర్‌ను అరెస్ట్ చేయాలి. అందుకోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి నిందితుడిని పట్టుకొస్తాం.’’ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.