Sai Dharam Tej Bike: సాయితేజ్‌ది సెకండ్ హ్యాండ్ బైక్, చలానా విషయంలో ట్విస్ట్.. టూవీలర్ లైసెన్స్ డౌటే: పోలీసులు
శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆయన నడిపిన స్పోర్ట్స్ బైక్, ప్రయాణించిన వేగం, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాల గురించి స్పష్టత ఇచ్చారు. శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారని తెలిపారు. ఎల్బీ నగర్‌కు చెందిన బుర్రా అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్ తేజ్ బైక్ కొన్నట్లు డీసీపీ వెల్లడించారు. దీంతో బైక్ అమ్మిన అనిల్ కుమార్‌ను కూడా పిలిచి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. బైక్‌ను కొన్న సాయి ధరమ్ తేజ్ అతని పేరు నుంచి తన పేరుపైకి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని చెప్పారు.
బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపామని మాదాపూర్ డీసీపీ తెలిపారు. గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్ వద్ద ఈ బైక్ ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండగా రూ.1,135 చలానా వేశామని తెలిపారు. ఈ చలాన్‌ను ఈ రోజు సాయి ధరమ్ తేజ్ ఓ అభిమాని క్లియర్ చేశారని డీసీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదం సమయంలో సాయి తేజ్ 72 కిలో మీటర్ల వేగంతో బైక్‌పై ప్రయాణిస్తున్నాడని చెప్పారు. దుర్గం చెరువు బ్రిడ్జిపై 102 కిలో మీటర్ల వేగంతో బైక్ నడిపారని తెలిపారు. రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపినట్లుగా డీసీపీ పేర్కొన్నారు.
రోడ్డుపై ఆటోను ఎడమ వైపు నుంచి ఓవర్ టెక్ చేయబోయి స్కిడ్ అయి కిందపడ్డాడని అన్నారు. అక్కడే ఇసుక ఉండడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. సాయి తేజ్ వద్ద టూ వీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ తమకు లభ్యం కాలేదని, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే ఉందని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించి ఉండడం వల్ల గాయాల తీవ్రత తక్కువగా ఉందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
హీరో కోలుకోవాలని అభిమానుల పూజలు
మరోవైపు, హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 101 కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కిషోర్ గునుగుల, సుజయ్ బాబు, ప్రశాంత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.