Lionel Messi Team Happy: మెస్సీ మ్యాచ్ గ్రాండ్ సక్సెస్.. డీజీపీ, సిపిలను ప్రశంసించిన మెస్సీ మేనేజర్, సెక్యూరిటీ టీమ్
Lionel Messi Match With Revanth Reddy | అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఫ్రెండ్లీ మ్యాచ్ గ్రాండ్ సక్సెస్ కావడంతో డీజీపీ, సిపిలను మెస్సీ మేనేజర్, సెక్యూరిటీ టీమ్ ప్రశంసించింది.

Lionel Messi In Hyderabad | హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనాకు చెందిన లియోనల్ మెస్సీ మేనేజర్, ఆయన భద్రతా బృందం తెలంగాణ డీజీపీ బి . శివధర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు లను ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో శనివారం నాడు జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం, వారికి, ముఖ్య అతిథులకు కల్పించిన పకడ్బందీ భద్రత చర్యలు అద్భుతంగా ఉన్నాయని మెస్సీ టీం అభినందించింది.

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ హై-ప్రొఫైల్ క్రీడా కార్యక్రమానికి పోలీసులు చేపట్టిన అత్యుత్తమ బందోబస్తు, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ మెస్సీ బృందాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం లోపల, బయట ట్రాఫిక్ నియంత్రణ, వేలాది మంది ప్రేక్షకులకు భద్రత కల్పించడం, ముఖ్య అతిథులు, మెస్సీ బృందం రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకున్న జాగ్రత్తలు వంటి అంశాలపై మెస్సీ మేనేజర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

భారీ స్థాయిలో మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలివచ్చినా, ఎక్కడా లోటుపాట్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం ముగియడం తెలంగాణ పోలీసుల వృత్తి నైపుణ్యానికి నిదర్శనమని వారు కొనియాడారు. మెస్సీకి, అతని బృందానికి కల్పించిన కట్టుదిట్టమైన భద్రత, ఎస్కార్ట్ సేవలు అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కితాబిచ్చారు. 
"ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాట్లు అవుట్‌స్టాండింగ్ గా ఉన్నాయి" అని మెస్సీ బృందం ప్రశంసించినట్లు తెలంగాణ పోలీస్ శాఖ తెలిసింది. ఈ నిర్వహణ భవిష్యత్తులో జరిగే మరిన్ని అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు దిక్సూచిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ అభినందన తెలంగాణ పోలీసులందరికీ గర్వకారణంగా, వారి సమర్థతకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






















