KTR Fires on Revanth Reddy: నోట్ల కట్టలతో దొరికిన చరిత్ర రేవంత్ రెడ్డిది.. సీఎం అయ్యాక కూడా బుద్ధి మారలేదు: కేటీఆర్
KTR press meet at Telangana Bhavan : తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, ఆ బురదనే అందరికీ అంటించాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు గౌరవం ఇచ్చి బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీష్ రావు విచారణకు హాజరయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం దక్కినా రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం మారలేదని, అడ్డగోలు సిట్ విచారణలతో ఎన్ని తమాషాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇప్పటివరకు ఏ అధికారి అధికారికంగా మాట్లాడలేదని, కేవలం లీకులతోనే కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. గతంలో హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసినా, కుట్రపూరితంగా ప్రజల సొమ్ముతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో వాదిస్తోందని ఆరోపించారు.
సింగరేణి బొగ్గు కుంభకోణం, సృజన్ రెడ్డి ప్రమేయం
బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందువల్లనే కక్షతో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణిలో టెండర్ల రిగ్గింగ్ జరుగుతోందని, సుమారు తొమ్మిది టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబమే నియంత్రిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 'సైట్ విజిట్ సర్టిఫికెట్' అనే నిబంధన తెచ్చి, కంపెనీలను బెదిరిస్తున్నారని, సృజన్ రెడ్డి స్వయంగా ఈ దందా నడిపిస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క రద్దు చేశామంటున్న నైనీ కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దందా ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇందులో బీజేపీకి కూడా వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాలు, డైవర్షన్ పాలిటిక్స్
అమృత్ టెండర్లు, రేషన్ బియ్యం స్కాం, లగచర్ల, మూసీ వంటి అంశాలపై తాము సాక్ష్యాధారాలు చూపినప్పుడల్లా ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు (Attention Diversion) ఇటువంటి నోటీసులు ఇస్తోందని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ఎనిమిది మంది మంత్రులను ధైర్యంగా ఎదుర్కొన్న హరీష్ రావుకు నలుగురు పోలీసుల విచారణ పెద్ద లెక్క కాదన్నారు. చట్టం, రాజ్యాంగంపై ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని, ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. పొంగులేటి కొడుకు భూకబ్జా యత్నంపై, సీఎం అనుచరుల తుపాకీ బెదిరింపులపై ఎందుకు సిట్ వేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ జర్నలిస్టులపై వేధింపులు ఆపాలని, కేవలం లీకులతో వార్తలు రాపించుకుంటే నిజాలు దాగవని హితవు పలికారు.
BRS భవిష్యత్తు కార్యాచరణ
రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో పోలీసులు బలి కావద్దని, అక్రమ కేసులు పెడుతున్న అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామన్నారు. రేవంత్ రెడ్డి హార్వర్డ్ పర్యటనపై స్పందిస్తూ, అక్కడ కూడా తన అసభ్యకర భాషను వాడుతారా అని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ రాదని చెప్పే రేవంత్ రెడ్డి అక్కడ ఏం నేర్చుకుంటారో చూడాలన్నారు. తమ పార్టీ జెండా గద్దెలను ముట్టుకుంటే కాంగ్రెస్ గద్దెలు పోవడం ఖాయమని, తమ కార్యకర్తలు దాడులను సహించరని హెచ్చరించారు. గత పదేళ్లలో తాము ఎప్పుడూ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని, రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.






















