KTR: రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులు.. మూటలు మోస్తూ తెలంగాణ పరువు తీస్తున్న సీఎం: కేటీఆర్
KTR Press Meet at Telangana Bhavan | రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులు ఉన్నారని, వారికి మూటలు మోసేందుకు 44సార్లు ఢిల్లీకి వెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

KTR Comments at Telangana Bhavan : యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటం రాష్ట్రానికి అవమానకరం అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటములు, ఛీత్కారాలు ఎదుర్కొని సీఎం అయ్యాక మారారనుకుంటే ప్రజల పొరపాటే. ఆయన ఏమాత్రం మారలేదు. యంగ్ ఇండియా వెనుక కథేంటో ఈడీ ఛార్జిసీటు తేల్చి చెప్పింది. గతంలో ఓటుకు నోట్లు కేసులో రేవంత్ పాత్రను ఎవరూ మరిచిపోరు. ఇది సీటుకు మూటల కుంభకోణం. రేవంత్ రెడ్డి గురించి గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పదవిని తెచ్చుకున్నారని చెప్పడం నిజం కాదా?
పీసీసీ చీఫ్ పదవి కోసం ఆనాడు రేవంత్ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు తన సీఎం పదవిని కాపాడుకునేందుకు తెలంగాణ నుంచి మూటలు ఢిల్లీకి పంపుతున్నారు. యావత్ తెలంగాణ పరువుతీసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప పేరు హౌసింగ్ స్కామ్ లో ఆయన పేరు రాగా రాజీనామా చేసి, విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ, నైతికత ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేక కాంగ్రెస్ పెద్దలు ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలి. మూటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీకి మూటలతోనే సీఎం పదవిని కాపాడుకున్నారని ఈడీ సైతం చెబుతోంది.
16 నెలల్లో 44సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కథ ఏంటో తేలిపోయింది. తనను కేసుల నుంచి తప్పించేందుకు రేవంత్ రెడ్డి చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు. ఆయనకు ఇద్దరు బాస్‌లు. ఓ బాస్ రాహుల్ గాంధీ అయితే.. మరో బాస్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా. ఏడాదిన్నరలో రేవంత్ రెడ్డి చేసింది బీఆర్ఎస్ నేతలపై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు. అన్ని విషయాలు మాట్లాడే రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీటులో రేవంత్ రెడ్డి పేరు వస్తే ఎందుకు నోరు విప్పడం లేదని’ కేటీఆర్ ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ఉంటాయని రేవంత్ రెడ్డికి తెలుసు. అ కేసులో రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఈడీ ఛార్జిషీటుతో అందరికీ తెలిసింది. ఛార్జిషీటులో రేవంత్ రెడ్డి పేరు ఉంటదన్న సమాచారంతోనే ఆయన మౌనంగా ఉన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకుని తిరుగుతాడు. కానీ తెలంగాణ సీఎంపై వచ్చిన ఆరోపణలపై స్పందించి రేవంత్ రెడ్డిని రాజీనామా చేపించాలి. ఆ పార్టీకి నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి. కర్ణాటకలో అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తప్పించాలని అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు, ఈడీ ఛార్జిషీటులో పేరున్నా సీఎంపై బీజేపీ నేతలు ఒక్క మాట మాట్లాడటం లేదు. మీరు, మీరు కుమ్మక్కై పరస్పరం అవినీతి ప్రోత్సహించుకుంటూ కాపాడుకుంటున్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ దాడుల సమయంలో నోట్ల కట్టలు లెక్కించేందుకు మెషీన్లు వెళ్లాయని ప్రచారం కావడం నిజం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.






















