(Source: ECI/ABP News/ABP Majha)
Nizam College Issue: నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రికి కీలక సూచనలు
Nizam College Issue: నిజాం కళాశాల విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.
Nizam College Issue: హైదరాబాద్ నిజాం కళాశాల విద్యార్థినిలు గత కొంత కాలంగా చేస్తున్న ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వసతి గృహ సౌకర్యం కల్పించాలని కోరుతూ.. అడర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి వివరాలు అఢిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆమెను కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపల్ ను ఆయన ఆదేశించారు.
Request Minister @SabithaindraTRS Garu to kindly intervene and address the issue
— KTR (@KTRTRS) November 8, 2022
As per the request of the students, girls hostel was built and handed over to the college. This situation seems unwarranted https://t.co/HddjVl8KG0
మూడ్రోజుల క్రితమే హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ కార్యాలయంలో విద్యార్థుల బైఠాయింపు ఉద్రిక్తతగా మారింది. నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్ ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజుల సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ప్రిన్సిపాల్.. ఎవరికీ తెలియకుండా పీజీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు స్పష్టమైన హామీ ఇఛ్చే వరకు ఆదోళనను ఆపబోమంటూ విద్యార్థినులు కార్యాలయంలోనే బైఠాయించి ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులలకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై స్పందించి.. విద్యార్థుల సమస్యను వెంటనే తీర్చాలని ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేశారు.
మంచినీటి కోసం గిరిజన విద్యార్థుల ఆందోళన
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో తాగేందుకు మంచి నీళ్ళు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగేందుకు మంచినీళ్లు లేకపోవడమే కాకుండా తినే అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని... ఇలాంటి పురుగుల అన్నం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని వెల్లడించారు. బియ్యం సరిగ్గా లేకపోతే కనీసం రీపాలిష్ కూడా చేయించట్లేరని తెలిపారు.
వర్షంలోనే విద్యార్థినుల ధర్నా..
తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నామని అధికారులకు చెప్పినా ఎలాంటి ఫలితం లేదని విద్యార్థినులు వాపోయారు. విద్యార్థినిలు ఎన్ని అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రోడ్డుపై బాలికలు ధర్నా చేస్తున్నారు. నీళ్లు లేకుండా ఎన్ని రోజులు గడపాలంటూ ప్రశ్నించారు. భైంసా - నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి తమకు నాణ్యమైన భోజనం, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.