KTR Latest News: కవిత వ్యాఖ్యలపై తొందరపడొద్దు, కేసీఆర్‌తో భేటీ అనంతరం పార్టీ నేతలకు కేటీఆర్ సూచనలు!
KCR KTR Meeting at Erravalli Farmhouse | ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్‌కు రాసిన లేఖపై బీఆర్ఎస్ నేతలెవరూ తొందరపడి స్పందించొద్దు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

Telangana Politics Today | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ, ఆమె వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఎవరు బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు సూచించినట్లు సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కీలకంగా సమావేశమయ్యారు. కవిత రాసిన లేఖ వైరల్ కావడం, అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎవరు స్పందించకూడదని టీఆర్ఎస్ నేతలకు చెప్పాలని, తన సన్నిహితులకు కేటీఆర్ సూచించారు.
కవిత వ్యాఖ్యలను వదిలేయండి..
పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలు బహిర్గతం అయ్యాయని, వాటిపై టీవీలు, ఇతర డిబేట్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ఎలాంటి కామెంట్లు చేయకూడదని టిఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక, దాని తర్వాత రాష్ట్రంలో పరిణామాలపై కేసీఆర్, కేటీఆర్ చర్చించారు. కేసిఆర్ చేసిన విమర్శలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా మార్పు వచ్చిందా, ఆయన విమర్శలు ఏ మేరకు ప్రభావం చూపాయి అనేదానిపై చర్చించారు.
కాళేశ్వరం కమిషన్ ఇటీవల ఆర్జీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు దాడి చేసింది. కమిషన్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలా, వద్దా.. రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలా అని న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్ష కోట్లు అవినీతి అని కాంగ్రెస్ చేసిన విమర్శలను తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు. రూ.94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించడం తెలిసిందే.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై చర్చ
ఫాం హౌస్‌లో ఆదివారం జరిగిన భేటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై కేసీఆర్, కేటీఆర్ చర్చించారు. జూన్ 2న జరగనున్న ఈ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తమ మార్క్ చూపించుకోవాలని, అందుకు తగ్గట్లు ఆవిర్భావ వేడుకలు జరగాలని చర్చించారు. వచ్చేనెలలో పార్టీ సభ్యత్వ నమోదుకు విస్తృతస్థాయి ఏర్పాట్లు చేయాలని కేసిఆర్ ఆదేశించినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో కమిటీల ఏర్పాటు, పార్టీ సభ్యత్వ నమోదు.. అందుకోసం ఏర్పాటుచేసిన యాప్ వివరాలు కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ, మరోవైపు పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు సమాచారం.






















