KTR on Kavitha Letter: కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది- కవిత లేఖపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
BRS Working President KTR | కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది- కవిత లేఖపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR responds on MLC Kavitha Letter | హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం వాటిని ఎలా వదిలించుకోవాలన్న దానిపై తమ పార్టీ ఫోకస్ చేసిందన్నారు కేటీఆర్ (KTR). తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తమ తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. ప్రతి పార్టీలోనూ అధ్యక్షుడికి నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలనుకుంటారు. కానీ బీఆర్ఎస్‌లో అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నారు. మా పార్టీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో ఓపెన్ కల్చర్, ప్రజాస్వామ్య స్ఫూర్తి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ’లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చలు, సమీక్షా సమావేశాలు జరిపాం. కొందరు నేతలు తమ అభిప్రయాలను చిట్టీలు రాసిచ్చారు. కొందరు నేతలు నేరుగా మైకుల్లోనే మాట్లాడి తమ అభిప్రాయాన్ని చెప్పారు. కొందరైతే కేసీఆర్‌కు ఇవ్వాలని చెప్పి మరీ చిట్టీలు కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీది ఓపెన్ కల్చర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం. పార్టీలో డెమోక్రసీ ఉంది కనుక ఎవరైనా పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి విషయాలు తీసుకెళ్లవచ్చు. కానీ ఒక్క లేఖతో ఏదో పెద్ద జరిగిపోయిందని హడావుడి చేయాల్సిన అవసరం లేదు.
కొన్ని అంతర్గతంగానే చర్చిస్తే బెటర్
ఏ హోదాలో ఉన్నా అంతర్గతంగా మాట్లాడాల్సిన కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చిస్తేనే బాగుంటది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుడితో కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమే. అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే మీరు వచ్చి వేరే ముచ్చట అడుగుతారని తెలుసు. మీరు తెలివైన వాళ్లు, అదే సమయంలో నేను కూడా తెలివైన వాడ్నేఅంటూ.. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె లేఖకు సంబంధించి అడిగిన ప్రశ్నలను కేటీఆర్ దాటవేశారు. అభిప్రాయాలు తెలిపే హక్కు, స్వేచ్ఛ ఉందన్నారు. కానీ లేఖ రాయడానికి గల కారణాలు.. ఆమె పార్టీలో నిజంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాలపై కేటీఆర్ నోరు విప్పలేదు.
కేంద్రం రేవంత్ రెడ్డికి సహకరిస్తోంది..
‘అమృత్ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి బామ్మర్దికి వేలకోట్ల ప్రాజెక్టులు ఇచ్చారని సాక్ష్యాధారాలతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కు ఫిర్యదు చేసినా పట్టించుకోలేదు. హెచ్‌సీయూ భూములపై సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఆర్థిక నేరం జరిగిందని చెప్పింది. దీనిపై ప్రత్యేకంగా విచారణ చేయడానికి బదులు సెలైంట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్.. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధాని మోదీ చెప్పినా కూడా వారి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. నెల రోజుల్లో స్పందించి చర్యలు తీసుకోవాలని’ కేటీఆర్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే నెల రోజుల తరువాత ఏం చేయాలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
30, 35 శాతం కమిషన్ లేకపోతే పనులు జరగడం లేదు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మా మంత్రులు డబ్బులు ఇవ్వకపోతే పనులు చేస్తలేరు. ఫైల్స్ కదలవు అని చెప్పారు. సొంత పిల్లనిచ్చిన మామ సైతం 94 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారని రేవంత్ రెడ్డి గుర్తించాలి. ఈ వార్తలు ఎక్కడ రాకపోతే సోషల్ మీడియా ద్వారా వార్తలు ప్రజలకు వెళ్లేలా చేస్తామన్నారు కేటీఆర్.






















