KTR On Amit Shah Comments: అమిత్ షా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం - ఆయన అబద్దాల బాద్‌షా: మంత్రి కేటీఆర్
KTR At Telangana Bhavan: జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చాక పార్టీ కార్యాలయాల్లో హైదరాబాద్ బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు
KTR Addressing the Media at Telangana Bhavan:హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి, మా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యత్నించారంటూ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గత కొన్ని రోజులుగా చూస్తే, తెలంగాణలో పొలిటికల్ టూరిస్టులు సందడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో పర్యాటకుడు తమ రాష్ట్రానికి వచ్చి తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేంద్ర మంత్రిని అమిత్ షా కాదు, అబద్ధాల బాద్ షా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. మా రాష్ట్రంపై జాతీయ పార్టీ నేతలకు కనీస అవగాహన కూడా ఉండదు. ఎయిర్‌పోర్టులో దిగిన తరువాత క్యా బోల్నా హై అని అడుగుతారంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చాక పార్టీ కార్యాలయాల్లో హైదరాబాద్ బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. కనీసం స్థానిక నేతలు రాసిచ్చిన విషయాల్లో నిజం ఉందా, అబద్ధాలున్నాయా కూడా జాతీయ పార్టీల నేతలు చూసుకోవడం లేదన్నారు. గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారని రాహుల్, అమిత్ షా లాంటి నేతల పర్యటనలపై కేటీఆర్ చురకలంటించారు.
అమిత్ షా కాదు.. అబద్ధాల బాద్ షా
తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాటలు, అబద్ధాలు చూస్తుంటే ఆయన అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షా అని పేరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రానికి పనికొచ్చే మాట ఒక్కటీ షా చెప్పలేదన్నారు. తుక్కుగూడలో చెప్పింది బీజేపీ తుక్కు డిక్లరేషన్ అని, వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటకట్టుకుందని, ఏకంగా 100కు పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని గుర్తు చేశారు. వాట్సాప్ యూనివర్సిటీ విషయాలను నిజాలుగా నమ్మి సభలో అమిత్ షా ప్రస్తావించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాధానాలు ఎందుకు చెప్పలేదు..
ఈ 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కోరాం. 27 ప్రశ్నలతో లేఖ కూడా రాయగా తమకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు మంత్రి కేటీఆర్. నిజాంను ఆయన వారసులు తలుచుకుంటున్నారో లేదో గానీ బీజేపీ నేతలు మాత్రం నిత్యం నిజాంను స్మరించుకుంటున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ మేర నిధులు ఇచ్చిందో రాష్ట్ర ఆర్థిక మంత్రి గణాంకాలతో వివరించారు. కేంద్రానికి మనం కట్టిందే ఎక్కువ ఉండగా, అందులో సగం మాత్రమే కేంద్రం మనకు ఇచ్చిందన్నారు. రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే, రాష్ట్రానికి కేంద్ర తిరిగిచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ కట్టినదాని కంటే ప్రధాని మోదీ 24 వేల కోట్లు అధికంగా ఇచ్చారని (రూ.3.94 లక్షల కోట్లు) చెప్పారు. మే 14న అమిత్ షా రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ అయితే రూ.4.11 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. ముగ్గురు మూడు రకాలుగా చెప్పి తాము చెప్పేవి అబద్ధాలు అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
Also Read: Harish On Amit Shah: అ"మిత్‌షా" ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా? కేంద్రం హోం మంత్రిని నిలదీసిన హరీష్