Kishan Reddy: ఆ వ్యక్తి హరీశ్‌తోనూ ఫోటో దిగారు, చిల్లర డ్రామాలు ఆపండి - కిషన్ రెడ్డి
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే వివాదంలో చిక్కుకోవడంతో బీజేపీ నేతలు వరుసగా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, టీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
పట్టుబడ్డ ముగ్గురిలో ఒకరైన నందకుమార్ అనే వ్యక్తి తనతోనే కాదని.. మంత్రి హరీష్ రావుతోను ఫోటో దిగారని అన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎవరినైనా చేర్చుకోవాలంటే నేరుగా తామే మాట్లాడుకుంటామని, మధ్యవర్తులను పంపే అవసరం లేదని అన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు తమకు ఓ కమిటీ ఉందని అన్నారు. నంద కుమార్ ను పంపించాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.
టీఆర్ఎస్ నేతలతో నంద కుమార్ దిగిన ఫోటోలను మీడియా ముందు చూపిన కిషన్ రెడ్డి చూపించారు. కేటీఆర్ బీజేపీ నాయకుడితో మాట్లాడిన ఆడియోను కూడా కిషన్ రెడ్డి మీడియాకు చూపించారు. పార్టీ చేరికలపై ఈటల రాజేందర్ ఆయా పార్టీల నాయకులతో నేరుగా మాట్లాడతారని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ఫాం హౌజ్‌లో దొరికిన సొమ్ము ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను వారు బయటపెట్టడం లేదు. దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? లేక కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి వచ్చిందా? అనేది తేలాల్సి ఉంది. ముందు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినది సీఎం కేసీఆరే. అలా వచ్చిన ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు, పార్టీలో మంచి స్థానాలు ఇచ్చారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ లెక్కన టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారో చెప్పాలి. మునుగోడులో ఓడిపోతామని ముందే కనిపించినట్లు ఉంది. సానుభూతి పొందేందుకు సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు. వందలాది ఆర్టీసీ బస్సుల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక ఉప ఎన్నికలలో గెలవడం కోసం ఇంతటి చిల్లర పనులు అవసరమా?’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
‘‘గతంలో దుబ్బాక విషయంలోనూ ఇలాంటి చిల్లర పనులు చేశారు. ఇప్పుడు మునుగోడులోనూ ఇలాంటి నాటకాలే ఆడుతున్నారు. అందుకోసం పోలీసులు దిగజారిపోయి వారికి సహకరిస్తున్నారు. ఎన్నికలకు ముందు వేలాదిమంది బీజేపీ కార్యకర్తలకు తాయిలా ఆశ చూపించి టీఆర్ఎస్ లో చేర్పించుకోలేదా? ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలి. త్వరలోనే ఆయన ఆడిన నాటకం అట్టర్ ఫ్లాప్ అవుతుంది’’ అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మంత్రి హత్యాయత్నం వ్యవహారంలో కూడా బీజేపీ పైనే ఆరోపణలు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మునుగోడు నాయకులకు కేటీఆర్ ఫోన్ చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరమని ప్రలోభపెట్టలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ ఉండబోదని అన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా జనాల్లో సానుభూతి పొందేందుకు కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రాఫిక్స్ తయారు చేసి పెట్టుకుందని ఆరోపించారు. మధ్యవర్తుల అవసరం లేకుండానే నేతలు బీజేపీలోకి రావొచ్చని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.