KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్‌కు వెళ్తారా?
KCR in Raj Bhavan: సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా రాజ్ భవన్‌కు దూరంగా ఉన్నారు. ఆయన చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 11న రాజ్ భవన్‌కు వెళ్లారు.
CM KCR: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు తర్వాత ఐదో చీఫ్ జస్టిగ్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది. గవర్నర్ తమిళిసై నేడు కొత్త సీజేతో రాజ్ భవన్‌లో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, దీనిపై స్పష్టత ఏమీ లేదు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వస్తారని సమాచారం. గవర్నర్ తమిళిసై - సీఎం కేసీఆర్ మధ్య కొద్ది కాలంగా వైరం ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ వైఖరితో ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. సీఎం వ్యవహారం పట్ల గవర్నర్ కూడా అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా రాజ్ భవన్‌కు దూరంగా ఉన్నారు. ఆయన చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 11న రాజ్ భవన్‌కు వెళ్లారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతున్నట్లుగా తెలుస్తోంది.
సాయంత్రం టీ హబ్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్
హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన టీ హబ్ 2.0ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం (జూన్ 28) ప్రారంభించనున్నారు. ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్ లకు వసతి కల్పించే ఉద్దేశంతో నిర్మించిన ఈ ఇన్నోవేషన్ కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణలకు నిలయం అని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు టీ హబ్ 2.0 ని ప్రారంభించనున్నారు. మూడు ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, సైయింట్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, అడోబ్ సీఈవో శంతనునారాయణ్, టీహబ్ సీఈవో శ్రీనివాస్‌రావు సహా వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు.
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
నేడు ఉదయం రాజ్ భవన్ లో సీజే ప్రమాణ స్వీకారం, సాయంత్రం టీ హబ్ ప్రారంభోత్సవం ఉండడంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వివి విగ్రహం జంక్షన్ వరకు ఉన్న మార్గంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్లుగా చెప్పారు.
అంతేకాక, సాయంత్రం 5.30 గంటలకు హైటెక్ సిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే కార్యక్రమం కోసం ప్రగతి భవన్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది.