KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్ - ఎమోషనల్ పోస్టులు పెడుతున్న బీఆర్‌ఎస్ నేతలు
KCR: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కాళేస్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పుడే ఆయన ఫామ్‌హౌస్ నుంచి బయల్దేరారు.

KCR: కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఫామ్‌హౌస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయల్దేరారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఫామ్‌హౌస్ వద్ద సందడి నెలకొంది. భారీగా నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి ఆ సందడి మరింత ఎక్కువైంది. ఇటు విచారణ జరిగే బీఆర్‌కే భవన్ వద్ద కూడా హడావుడి కనిపిస్తోంది.
ఫామ్‌హౌస్ నుంచి విచారణకు బయల్దేరిన కేసీఆర్‌కు పూలు జల్లి సాగనంపారు బీఆర్‌ఎస్ శ్రేణులు. ఆయన కాన్వాయ్ బయల్దేరిన టైంలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జై కేసీఆర్ అంటూ నినదించారు. ఆయన కాన్వాయ్ బయల్దేరినప్పటి నుంచి దారి పొడవున కొందరు కార్యకర్తలు కార్లు, టూవిలర్స్‌లో ఫాలో అయ్యారు.
ముందుగా ఇంట్లో నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ అనంతరం విచారణకు బయల్దేరారు. ఎప్పుడు బయటకు వెళ్లిన చేయికి దట్టీ కడుతున్నారు. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. ఆయన బయల్దేరిన టైంలో కుటుంబ సభ్యులు, కొందరు పార్టీలోని కీలక నేతలు ఆయన వెంట ఉన్నారు.
కాసేపట్లో బీఆర్‌ఎక్కే భవన్‌కు చేరుకొని అక్కడ జరిగే విచారణకు హాజరవుతారు. ఈ విచారణ గదిలోకి 9 మంది నేతలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. హరీష్ రావు, కేవిత, ప్రశాంత్ రెడ్డి కూడా విచారణ టైంలో ఉంటారని తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ నేతల ఎమోషనల్ పోస్టులు
కేసీఆర్ విచారణ సందర్భంగా కేటీఆర్, హరీష్‌రావుతోపాటు మిగతా పార్టీ శ్రేణుల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన కేసీఆర్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక కార్యక్రమాలను కేసీఆర్ విజయవంతంగా సాధించారని వివరించారు. ప్రజాస్వామ్య పోరాటంతో, తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. ఉద్యమం ద్వారా కోట్లాది మందికి స్వరాష్ట్ర ఆశయాన్ని అందించారని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరవుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ బలం, జీవనదృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి జోకర్ కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదని ఎద్దేవా చేశారు. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు 100 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ సాధించిన విజయాల్లో పదవంతైనా సాధించలేరని విమర్శించారు.
కేసీఆర్‌ని కమిషన్ ముందు నుంచో బెడితే కాంగ్రెస్ నాయకులకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదన్నారు కేటీఆర్. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడేనని అభిప్రాయపడ్డారు. సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే కాంగ్రెస్ నేతలని మండిపడ్డారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదని అన్నారు.





















