Revanth News: కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసన్, దూరంగా ఉంటే తెలంగాణకు మంచిది: మీడియాతో రేవంత్ చిట్‌చాట్
Revanth Chit Chat With Media: బడ్టెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హజరుకాకపోవడాన్ని సీఎం రేవంత్ తప్పుబట్టారు. ఆయనకు భేషరం లేదన్న సీఎం...కేసీఆర్‌ను ఎక్స్‌పైర్ మెడిసిన్‌తో పోల్చారు.
Telangana CM Revanth Reddy Comments On KCR: ప్రజాతీర్పును కేసీఆర్(KCR) గానీ, బీఆర్ఎస్(BRS) నేతలు గానీ అంగీకరించే స్థితిలో లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్( KCR)కు ఏమాత్రం భేషరం లేదన్న సీఎం రేవంత్...కనీసం గవర్నర్ ప్రసంగానికి హాజరుకావాలన్న జ్ఞానం కూడా లేదన్నారు. ఆయనొక ఎక్స్‌పైరి మెడిసిన్‌నని... దీనికి తెలంగాణ(Telangana) సమాజం ఎంత దూరంగా ఉంటే అంతమంచిదన్నారు...
ఇదేనా కేసీఆర్ చిత్తశుద్ధి
ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి గవర్నర్( Governor) ప్రసంగానికి హాజరుకాకపోవడం చూస్తేనే ప్రజల పట్ల కేసీఆర్( KCR)కు ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో పిచ్చపాటిగా మాట్లాడిన సీఎం రేవంత్.... కేసీఆర్ భేషరం మనిషన్నారు. అధికారం కోల్పోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆయన సూచించారు. బీఆర్‌ఎస్(BRS)కు ఓటమితో బుద్ది చెప్పినా... కేసీఆర్‌కు ఇంకా బుద్ధిరాలేదన్నారు. ఇంకా అదే పెత్తందారు పోకడలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఆయనొక ఎక్స్ పైరీ మెడిషన్ అన్న రేవంత్‌రెడ్డి... అందుకే తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు.
బీఏసీకి డుమ్మా
తెలంగాణలో సీనియర్ నేత, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు కనీసం గవర్నర్ ప్రసంగానికి హాజరుకాకపోవడం చూస్తే....ప్రతిపక్ష నేతగా ఆయన ఏంటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రజల పక్షాన వారి తరపున ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయాల్సిన సీనియర్ నేత...ఈ విధంగా వ్యవహరించడం తగునా అని ప్రశ్నించారు.
కనీసం బీఏసీ(BAC) సమావేశానికి కూడా రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీఏసీ సమావేశానికి కడియం శ్రీహరి హాజరవుతారని పేరు ఇచ్చారని..ఇలా ఎవరిపడితే వాళ్లు వస్తామంటే ఎలా కుదురుతుందన్నారు. రేవు హిమాన్ష్ కూడా వస్తా అంటారేమోనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయించామని...కేసీఆర్ తప్పకుండా సభకు రావాలని కోరుకుంటున్నట్లు
రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. కాళేశ్వరంపై నిబంధనల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని.. కసబ్‌ను ఉరి తీయడం కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో జరిగనట్లు తప్పులకు తావులేకుండా టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కూడా ప్రొసీజర్ తోనే వెళుతున్నామన్నారు. భవిష్యత్‌లో నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఛైర్మన్‌గా సివిల్ సర్వీస్ నుంచి వచ్చిన వారిని తీసుకోవడం జరిగిందన్నారు రేవంత్. సభ్యులనూ ఉన్నత విద్యావంతులనే ఎంపిక చేసినట్లు వివరించారు. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నియామకాలు చేపడతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే గ్రూప్ పరీక్షలను నోటిఫికేషన్ విడుదలవుతుందని....నిరుద్యోగులు ఎవరూ అందోళన చెందాల్సి పనిలేదని అభయమిచ్చారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువతను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని....వారి మాయలో పడొద్దని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే రెండు హామీలు అమలవుతున్నాయని.....మరో రెండు హామీలను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.