KTR About PM Modi: రూ.20 వేల కోట్లు గుజరాత్ కు! తెలంగాణకు మాత్రం రిపేర్ షాప్- ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్
KTR About PM Modi: తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR About Kazipet coach factory: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్ అని.. తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ కి 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ప్రధాని మోదీ అని, 9 ఏళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదంటూ సెటైర్లు వేశారు.
ప్రధాన మంత్రి మోదీ స్పీచ్ మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు. తెలంగాణకి వచ్చిన ప్రతిసారి కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందని కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం పరిపాటిగా మారిందన్నారు. గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసి అన్యాయాన్ని గుర్తుంచుకుని, బీజేపీ నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పునః ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు, రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను కేంద్రం పక్కనపెట్టడం రాష్ట్రంపై ప్రధానమంత్రి ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ప్రధాని మోడీ ప్రసంగంపై విరుచుకుపడిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS.
— BRS Party (@BRSparty) July 8, 2023
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్
- గుజరాత్ కి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ… pic.twitter.com/5MITL15HqH
యువతకు బంగారు కాలం అని చెబుతున్న మోదీ 9 ఏళ్లలో యువతకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలన్నారు. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెరిగిందని ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అంటూ అవహేళన చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి మోదీ అన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగా.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 16 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. లక్షలాది ఉద్యోగాలను అందించే ఐటిఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వంలోకి రాగానే ప్రధాని మోదీ రద్దు చేశారని, ఈ మోసాన్ని ఎన్నటికీ తెలంగాణ యువత మరిచిపోదన్నారు.
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలను ముందుగా భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఖాళీల భర్తీని ప్రస్తుత గవర్నర్ తమిళసై తొక్కిపెట్టిన విషయంపై ప్రధాని స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఒక్క గురుకుల విద్యార్థి పైన 1,25,000 ఖర్చుతో విద్య అందిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి, 700 రైతుల మరణాలకు కారణమైంది మోదీ ప్రభుత్వం అని విమర్శించారు. కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారు కానీ ,రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయాలనుకోలేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. పిట్ట బెదిరింపులతో కలవరపడే ప్రభుత్వం, నేతలు తాము కాదన్నారు. కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మోదీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణం అన్నారు కేటీఆర్. పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతల కుటుంబసభ్యులు కేంద్ర కేబినెట్లో మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి, అందరి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial