ముగిసిన ఈడీ విచారణ, 16న మళ్లీ రావాలని కవితకు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఈడీ విచారించనుంది. దీనికి సంబంధించిన లైవ్‌అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
LIVE
Background
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతోపాటు కీలకమైన బీఆర్‌ఎస్ లీడర్లు, పార్టీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయనిపుణులు ఢిల్లీ వెళ్లారు.
కవితను అరెస్టు చేయొచ్చు... చేసుకుంటే చేససుకోనీ... భయపడేది లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు హై టెన్షన్ పెట్టిస్తున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కవిత పోరాటం చేసిన తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరుకానున్న వేళ ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఆసక్తి ఉంది. ఈడీ అధికారులు అనుమతి ఇస్తే ఆమెతోపాటు న్యాయనిపుణులు ఒకరిద్దరు విచారణ సమయంలో అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కవితని సీబీఐ ఒకసారి విచారించింది. స్టేట్‌మెంట్‌తోపాటు కీలకమైన పత్రాలు, బ్యాంకు వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఈడీ విచారించనుంది. తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్న వారిలో కనిపిస్తోంది.
ఫిళ్లై స్టేట్‌మెంట్‌తో కలకలం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న (మార్చి 7) అరెస్టు అయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది.
ఇది జరిగిన రెండు రోజుల్లోనే పిళ్లైన యూ టర్న్ తీసుకున్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలంగాణ ఎమ్మెల్సీ తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఆప్‌నేత సిసోడియాను కస్టడీకి అడిగిన సమయంలో కూడా ఈ ఆరోపణలు రిపీట్ చేసింది ఈడీ. కవిత, సిసోడియా ఈ కేసులో కీలకమని కామెంట్ చేసింది.
ముగిసిన ఈడీ విచారణ, ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ... ఆమె సెల్ ఫోన్ ను సీజ్ చేసింది. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించింది.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, 6 గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు 6 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికి వరకు సేకరించిన ఆధారాలు, ఇతర నిందితుల వాంగ్మూలాలతో కవితను విచారిస్తున్నారు. అయితే ఈడీ విచారణపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దిల్లీలోని ఈడీ కార్యాలయం 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులను మోహిరించారు. విచారణ సందర్భంగా కవిత ఫోన్ ఈడీ స్వాధీనం చేసుకుంది.
మూడు గంటలుగా కవితను విచారిస్తున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను మూడు గంటలపైగా ఈడీ విచారిస్తోంది. లోపల పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం తెలంగాణ, ఢిల్లీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
కవిత ఒక్కరినే విచారణకు అనుమతించిన ఈడీ అధికారులు
భర్త అనిల్‌తోపాటు ఈడీ ఆఫీస్‌కు ఎమ్మెల్సీ కవిత వచ్చారు. అయితే ఆఫీస్‌కు వెళ్లాక ఆమెను ఒక్కరిని మాత్రమే లోపలికి రాణించారు. మిగతా వారిని గేటు వద్ద ఆపేశారు.
ఈడీ విచారణకు బయల్దేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడీ విచారణకు బయల్దేరారు. కేసీఆర్ నివాసంలో నిన్నటి నుంచి మంతనాల తర్వాత ఈడీ విచారణకు వెళ్లారు.