(Source: ECI | ABP NEWS)
Jubilee Hills By poll: ఆరు గ్యారంటీలు వర్సెస్ బాకీ కార్డు.. గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు
Jubilee Hills By Election 2025 | ఏ అంశం ఏ ఓటర్ పై పని చేస్తుందో తెలియదని, అందుకనే వివిధ అంశాలను ప్రజల ముందు పెడుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీలు చెబుతున్నాయి.

Jubilee Hills By poll 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల గడువు (అక్టోబర్ 21) ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 చివరి తేదీ. నవంబర్ 11న పోలింగ్. దీంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డివిజన్ల వారీగా ప్రచారబాట పట్టారు. అయితే ఈ ప్రచార పర్వంలో స్థానిక సమస్యల కన్నా ఇతర రాజకీయ అంశాలపైనే అన్ని పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతోంది. అధికార మార్పిడి తర్వాతి రాజకీయాలు, ప్రభుత్వ హామీల అమలు, జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాల మీదనే పార్టీలు ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ అంశాలను తమ ప్రధాన ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
అధికార కాంగ్రెస్ (Congress) వాడుతున్న ప్రధాన ప్రచారాస్త్రాలు ఇవే.
అధికార పార్టీ కాంగ్రెస్ తరుపున మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఆరు గ్యారంటీల అమలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనే ప్రచారాస్త్రాన్ని విరివిగా వాడుతున్నారు. అందులో ముఖ్యమైనవి.
1. అమలవుతున్న ఆరు గ్యారెంటీలు - సంక్షేమ పథకాలు - రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు, రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ, పది లక్షల వరకు ఆరోగ్య శ్రీ పెంపు వంటి పథకాలను ఈ ఉపఎన్నికలో తన ప్రచారాస్త్రాలుగా వాడుతోంది.
2. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తీరు - పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, డబుల్ బెడ్ రూంల పేరు చెప్పి పేదలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీపై ఉపఎన్నికల ప్రచారంలో విమర్శనాస్త్రాలను సంధిస్తోంది.

3. మైనారిటీల మద్దతు - ముస్లిం మైనారిటీల కోసం కాంగ్రెస్ ఎం.ఐ.ఎం పార్టీ మద్దతు సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ పోటీ చేయడం లేదు. అంతే కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం మైనారిటీల కోసం స్మశాన వాటికకు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఇక క్రైస్తవ పాస్టర్లు, ముఖ్యనేతలతో మంత్రి వివేక్ సమావేశమయి వారి మద్దతుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి అవసరమైన క్రైస్తవ స్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
4. బీఆర్‌ఎస్-బీజేపీ రహస్య ఒప్పందం - ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ - బీజేపీలు లోక్ సభలో లోపాయకారిగా సహకరించుకున్నట్లు, ఈ ఉపఎన్నికలలోనూ రెండు పార్టీలు దోస్తీ చేస్తున్నాయని విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ కుట్ర రాజకీయాలను ఓడించాలని హస్తం నేతలు తమ ప్రచారంలో పిలుపునిస్తున్నారు. బీజేపీ - బీఆర్ఎస్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని పదే పదే చెబుతూ ఈ అంశాన్ని ప్రచారాంశంగా వాడుతున్నారు.
5. ఎస్సీ వర్గీకరణపై హామీ - జూబ్లీ హిల్స్ శాసన సభ నియోజకవర్గంలోని ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎస్సీ వర్గీకరణ హామీని ముఖ్య ప్రచారాంశంగా వాడుతున్నారు.
"కాంగ్రెస్ మోసం - పదేళ్ల బీఆర్‌ఎస్ అభివృద్ధి" అంటూ బీఆర్ఎస్ నినాదం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారంగా మారిందని బీఆర్ఎస్ ఈ ఉపఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిని - కాంగ్రెస్ పాలనను పోల్చి చెబుతోంది.
1. కాంగ్రెస్ బకాయి కార్డు - కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పక్కన పెట్టేసిందని బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ఈ ఎన్నికలో ప్రచారం చేస్తున్నారు. మహిళలకు ₹2,500, ₹500కే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీల అమలులో పూర్తిగా ఫెయిలయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆరు హామీల అమలును ప్రశ్నిస్తూ గులాబీ నేతలు ప్రతీ ఇంటికీ 'కాంగ్రెస్ బకాయి కార్డు' పంపిణీ చేస్తున్నారు.
2. ఉపఎన్నికను 'రెఫరెండం'గా చిత్రించడం - జూబ్లీహిల్స్ శాసన సభకు వచ్చిన ఈ ఉపఎన్నికను రిఫరెండంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెబుతున్నారు. కాంగ్రెస్ పరిపాలన తీరు, ఆ ప్రభుత్వంపై ప్రజలు కోల్పోతున్న విశ్వసనీయతకు ఈ ఉపఎన్నిక రెఫరెండం అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే అంశాన్ని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని సూత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

3. సానుభూతి పవనాలే లక్ష్యంగా - దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణాన్ని, ఆయన బతికున్నప్పుడు చేసిన పనులను బీఆర్ఎస్ నేతలు పదే పదే జూబ్లీహిల్స్ ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. ఆయన సతీమణి సునీత కూడా ఆయా వేదికలపై కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రజల్లో కొంత మేర సానుభూతి పెరిగిందని అధికార పక్షమే కాదు, ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో మాగంటి గోపీనాథ్ చేసిన పనులను పదే పదే గుర్తు చేస్తూ సానుభూతి పవనాలు వీచేలా ఈ అంశాలను ప్రధాన ప్రచారాంశాలుగా బీఆర్ఎస్ మలుచుకుంది.
4. బుల్‌డోజర్ పాలన - కాంగ్రెస్ పాలన వచ్చాక జీహెచ్ఎంసీ పరిధిలో బుల్‌డోజర్ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ విశేషంగా ప్రచారం చేస్తోంది. డ్రైనేజీ పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తోందని, ఇది ఆగాలంటే బీఆర్ఎస్ నే గెలిపించాలని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
5. దళిత బంధు పథకం - ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, పోటీగా బీఆర్ఎస్ దళితబంధు పథకాన్ని తన ప్రచారాంశంగా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల దళిత బంధు సాయం ఆగిపోయిందని ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది.
మోదీ నాయకత్వమే ప్రధాన ప్రచారాంశంగా బీజేపీ
1. ఒక్క అవకాశం - జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నది బీజేపీ ప్రచారాంశమైంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీనే గెలిపించాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరుతున్నారు. సానుభూతి కాకుండా అభివృద్ధికే ఓటేయాలని పిలుపునిస్తున్నారు.
2. స్థానిక సమస్యల ప్రస్తావన - పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలోని సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న అంశాన్ని డివిజన్లలో బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి ఓటేస్తే నియోజకవర్గ రూపు రేఖలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మారుస్తామని హామీలు ఇస్తున్నారు.
3. మోదీ చరిష్మా - ఆపరేషన్ సింధూర్ విషయంలోను, ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్న అంశాన్ని బీజేపీ ముఖ్యమైన ప్రచారాస్త్రంగా వాడుతోంది. చదువుకున్న ఓటర్లకు ఈ విషయాలు చెబుతూ, పాకిస్తాన్ పై ఎన్డీఏ ప్రభుత్వం చేసిన దాడులను సామాన్య ఓటర్లకు వివరిస్తున్నారు. మోదీ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా మోదీని బలపర్చాలని కోరుతున్నారు.
4. అవినీతి ఆరోపణలు ప్రధానాస్త్రం - బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతిమయ పార్టీలన్న అంశాన్ని ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాంశంగా వాడుతున్నారు. కాళేశ్వరం అవినీతి విషయాన్ని బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు వాడుతుంటే, మరి కొందరు మంత్రుల్లో కీచులాటలు, కాంట్రాక్టుల విషయంలో వారి మధ్య గొడవలు అవినీతికి నిదర్శనమని కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు. అవినీతి పాలన వద్దంటే బీజేపీకే ఓటు వేయాలని కమలం నేతలు ఉపఎన్నికల్లో అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రంగా ప్రత్యర్థి పార్టీలపై వాడుతున్నారు.
5. ఎస్సీ వర్గీకరణ కార్డు - ఎస్సీ వర్గీకరణ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమయిందని ప్రచారం చేస్తూ మాదిగ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇలా మూడు పార్టీలు పోటా పోటీగా పలు అంశాలను తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏ అంశం ఏ ఓటర్ పై పని చేస్తుందో తెలియదని, అందుకనే వివిధ అంశాలను ప్రజల ముందు పెడుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు మూడు పార్టీలు చెబుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ప్రచారాస్త్రాలను బయటకు తీసి దూకుడుగా ప్రత్యర్థి పార్టీలకు కళ్లెం వేస్తామని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.






















