Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు నామపత్రాలు వేసినట్టు తెలుస్తోంది.

Jubilee Hills by-election: తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న చాలా మంది నామినేషన్లు వేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లు గడువు ముగిసింది. ఈ లోపే ప్రధాన పార్టీ అభ్యర్థులు సహా వందల మంది వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. వీటిలో ఎన్ని చెల్లుబాటు అవుతాయి, ఎన్ని తిరస్కరణకు గురి అవుతాయో 24 గంటల్లో తేలిపోనుంది. తర్వాత ఆక్టోబర్ 24 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది.
చివరి రోజు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి
బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన చివరి రోజు నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా వచ్చిన ఆయన నామినేషన్ వేశారు. ఆయనతోపాటు సీనియర్ లీడర్లు ఉన్నారు. ఈ స్థానంలో బరిలో నిలబడేందుకు చాలా మంది పోటీ వచ్చినప్పటికీ చివరి వరకు అన్ని కాలిక్యులేషన్స్ వేసుకొని దీపక్‌రెడ్డికే బీజేపీ అధినాయకత్వం ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉంటే, బీఆర్‌ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలో నిలబడ్డారు. ఇక్కడ అధికారికంగా ఎన్ని నామినేషన్లు పడ్డా సరే పోటీ మాత్రం ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యే ఉంటుంది.
వందల మంది నామినేషన్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అన్ని పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. అందుకే ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా ఇరుకున పెట్టాలో అని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. వారిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. హైడ్రాతో ఇబ్బంది పడ్డవాళ్లు. ప్రభుత్వ పథకాలు అందని వారిని టార్గెట్ చేస్తూ వారంతా తమకు ఓటు వేసేలా ఒప్పించే వ్యూహాల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం తమకు అనుకూలమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నాయి. గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అనుసరిస్తున్న విధానాలు, గత పదేళ్లుగా ప్రజలు పడిన ఇబ్బందులు గుర్తు చేస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు ప్రజల మనసులు గెలుచుకునేందుకు పావులు కదుపుతుంటే న్యూట్రల్‌గా ఉన్న వాళ్లు, అన్ని పార్టీలపై కోపం ఉన్న వాళ్లు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా జూబ్లీహిల్స్ బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
150 వరకు నామినేషన్లు
ప్రభుత్వం చెప్పినట్టు ఇంత వరకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదని ఆరోపించిన నిరుద్యోగులు జూబ్లీహిల్స్‌లో నామినేషన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ బాధితులు కూడా నామపత్రాలు వేసినట్టు తెలుస్తోంది. ఇలా బాధితులంతా బరిలో ఉండి గేమ్‌ఛేంజర్‌గా మారి తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్టు సమాచారం. వందకుపైగా దాదాపు 150 వరకు నామినేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
24న సాయంత్ర తుది పోటీదారుల జాబితా
భారీగా వచ్చిన నామినేషన్లు రేపు బుధవారం అధికారులు పరిశీలిస్తారు. వాటిలో రూల్స్‌కు అనుగుణంగా ఉన్న వాటిని ఉంచుతారు మిగతా వాటిని తిరస్కరిస్తారు. ఇలా కొన్నింటిని తిరస్కరించిన తర్వాత కొన్ని ఫైనలైజ్ అవుతాయి. అప్పుడు కూడా అక్టోబర్ 24 వరకు ఎవరైనా ఉపసంహరించుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా కొందరు తమ నామినేషన్ వెన్కక్కి తీసుకున్న అనంతరం మిగిలిన వాళ్లు తుది పోటీదారులుగా ప్రకటిస్తారు. వారిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి బీఫామ్ ఇచ్చి పోటీ చేస్తున్న వారికి పార్టీ గుర్తును ఇస్తారు మిగతా వాళ్లకు వారు ఎంపిక చేసుకున్న గుర్తులను అధికారులు కేటాయిస్తారు. వీళ్లకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది.





















