Indigo Flights cancellation: ఇండిగో సంక్షోభం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 115 విమాన సర్వీసులు రద్దు
దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో గందరగోళం నెలకొంది. నేడు సైతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించి 115 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది.

Shamshabad Airport in Hyderabad |హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ధర ఎక్కువ అని తెలిసినా తమకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం కోసం ఇండిగో ఎయిర్ లైన్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారి కష్టాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కొందరి పరిస్థితి అయితే మాటల్లో సైతం వివరించలేని విధంగా ఉన్నాయి. ఈక్రమంలో ఆదివారంసైతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి రాకపోకలు సాగించే విమాన ప్రయాణీకులకు ఆలస్యంగా అప్‌డేట్ వచ్చింది. విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మొత్తం 115 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాల నుండి రావాల్సిన ఇండిగోకు చెందిన 54 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 61 విమానాలు సైతం రద్దయ్యాయి.
ఇండిగో విమానాల రద్దు సమయంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఇండిగో విమానయాన సంస్థ భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో తలెత్తిన సంక్షోభం దృష్ట్యా, ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. విమాన ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి స్పైస్‌జెట్ విమాన సంస్థ దేశవ్యాప్తంగా అదనంగా పలు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది.
ప్రత్యేక రైలు సర్వీసులు, బస్సులు ఏర్పాటు
రైలు, రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైల్వేశాఖతో పాటు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) సైతం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పుణె, హావ్‌డా వంటి నగరాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. రైల్వేశాఖ మొత్తం 100 కంటే ఎక్కువ ట్రిప్పులతో ప్రత్యేక రైలు సర్వీసులు తీసుకొచ్చిది. మరో 37 రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించి సేవలు కొనసాగిస్తోంది.
Also Read: Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి జీఎంఆర్ సంస్థ, తెలంగాణ ఆర్టీసీ సంయుక్తంగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ప్రత్యేక బస్సులు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ సహా ఇతర ముఖ్య ప్రాంతాలకు నడుపుతున్నారు. రద్దు అయిన విమాన ప్రయాణీకులకు ఈ రవాణా ఏర్పాట్లు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి. కానీ తప్పనిసరిగా ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణం చేయాలనుకున్న వారికి, అర్జంటుగా పనులు, వైద్య చికిత్స లాంటి అవసరాలు ఉన్న ప్రయాణికులకు మాత్రం నరకప్రాయంగా మారింది.
Also Read: IndiGo Flight Cancellations: అప్పటిలోగా ఫ్లైట్ టికెట్ రిఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశాలు
ప్రయాణికులకు గత కొన్ని రోజులుగా కలుగుతున్న అసౌకర్యంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించి చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం, తీవ్ర పరిణామాలకు ఇండిగో నిర్లక్ష్యమే కారణమని.. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో కారణం చెప్పాలని ఇండిగో సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.






















