(Source: ECI/ABP News/ABP Majha)
Telangana News: రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. రంగనాథ్ తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. పరిణామాలు మాత్రం రేవంత్ మెడకు చుట్టుకునే పరిస్దితులు వచ్చేశాయి.
Telangana: చెరువైనా.. ప్రభుత్వ భూమైనా.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతీ చెరువూ కబ్జా కోరలకు చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. నగరం చుట్టు పక్కల కబ్జాకోరులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం హైడ్రా. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి నగరాల పరిధిలో ఆక్రమణకు గరైన ప్రభుత్వ భూములను రక్షించి, కబ్జాకోరుల వెన్నులో వణుకు పుట్టించడంలో ఊహలకందని విధంగా దూసుకుపోతున్న హైడ్రా పనితీరుపై ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. జయహో రేవంత్, జయహో హైడ్రా కమీషనర్ రంఘనాధ్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అంతా ఓకే.. ఆపరేషన్ హైడ్రాకు తిరుగులేదు. కానీ తాజాగా హైడ్రా కథ కొత్త మలుపు తిరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన పొలిటికల్ ముళ్లపొదలను దాటుకుని ముందుకు సాగాల్సిన సవాలు హైడ్రా ముందుంది.
దానంతో ప్రారంభం
హైడ్రాకు మొదటి పొలిటికల్ సవాల్ విసిరింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ వీడి ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కొనసాగుతన్నారు ఎమెల్యే దానం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69, నందగిరి హిల్స్ , గురుబ్రహ్మ నగర్ కాలనీలో 800 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాన్ని రక్షించి, గోడ కడితే, ఆ గోడను కూల్చేశారు దానం అనుచరులు. దీంతో దానంతోపాటు అనుచరలపై జీహెచ్ ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దానం ఏ3గా ఉన్నారు. దీంతో అధికార పార్టీలో ఉన్న తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ దానం చిందులేసిన విషయం తెలిసిందే. నేను లోకల్,నీ సంగతి తేలుస్తా అంటూ రెచ్చిపోయారు.
మరికొందరు సొంతపార్టీ నేతలపై ఆరోపణలు
ఇలా మొదలైన పొలిటికల్ వివాదం హైడ్రాను చుట్టుముడుతోంది. అక్రమ నిర్మాణాలు కూల్చుకుంటూ పోతుంటే, అంతే స్థాయిలో హైడ్రా తీరుపై అధికార పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా సిఏంకు తెలిసే జరుుగుతుందని మరికొందరు రేవంత్ తీరుపై మండిపడుతున్నారట. ఇదిలా ఉంటే అసలు సినిమా ముందుంది. దానం నాగేందర్ వివాదం కేవలం ట్రైలర్ మాత్రమే అనేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ చెరువులను కబ్జా చేసిన నేతలు కొందరు నిబంధనలకు విరుద్దంగా బఫర్ జోన్ పరిధిలో విలాసవంతమైన గెస్ట్ హౌస్లు నిర్మించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి ఫ్యామిలీ ఫామ్ హౌస్!
హిమాయత్ సాగర్ పరిధిలోని బఫర్ జోన్ ఆక్రమించి ఓ మంత్రి ఆయన సోదరులు ఒక్కొక్కరు పదిఎకరాల్లో గెస్ట్‌హౌస్‌లు నిర్మించి,ప్రభుత్వ భూమి కబ్జా చేసారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరుచూ ఆ మంత్రి సైతం అదే ఫామ్ హౌస్‌కు వెళ్తుంటారట. మరి నెక్ట్స్ హైడ్రా కన్ను ఈ ఫామ్ హౌస్‌లపై పడితే దానం రెచ్చిపోయినట్టుగానే ఆయన కూడా హైడ్రాపై కన్నెర్రజేస్తారా, లేక రేవంత్‌పై కక్ష కడతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
తరచూ పార్టీలు మారే సీనియర్ నేతల ఫామ్ హౌస్
హిమాయత్ సాగర్‌కు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు చెందిన ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ కూడా బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మించిందే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ నేతను రేవంత్ టచ్ చేయగలరా ఆ ఫామ్ హౌస్ కూల్చగలరా అని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి.
రేవంత్ సోదరుడిపైనే ఆరోపణలు
దుర్గం చెరువుకు చెందిన బఫర్ జోన్ పరిధిలో ఏకంగా సిఎం రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతి రెడ్డి విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి సొంత సోదరుడి ఇంటిపైకి రేవంత్ హైడ్రా బుల్డోజర్ వెళ్తుందా ఆ ఇంటినీ కూల్చేస్తారా, కూల్చకపోతే వచ్చే విమర్శలకు బదులివ్వగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతన్నాయి.
ముందు హైడ్రా వెనుక పార్టీ నేతలు
రేవంత్ రెడ్డికి హైడ్రా దూకుడు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది.రాజకీయ నాయకుల గుండెల్లో గునపాలు దించుతోంది. అలా అని హైడ్రాను అడ్డుకుంటే ప్రజల్లో అబాసుపాలవ్వాల్సి వస్తుంది. ముందు చూస్తే హైడ్రా, వెనుక చూస్తే పార్టీ నేతల కబ్జా ఆరోపణలు. ఈ బుల్డోజర్ ప్రకంపనలు రేవంత్ ఎలా ఎదుర్కొంటారనేది ఉత్కంఠతగా మారింది.