Hyderabad: చెప్పుతో కొడతా, ఆ సీఐ నా చుట్టమే - నడిరోడ్డుపై మహిళ బూతులతో రచ్చ
మా మామయ్య కూకట్ పల్లి సీఐ. నా కారునే డ్యామేజ్ చేస్తావా? చెప్పు తీసుకుని కొడతా! అంటూ నడిరోడ్డుపై మహిళ రచ్చ చేసింది. హైదరాబాద్ లోని మీర్‌పేట్ సమీపంలోని టీకేఆర్ కమాన్ వద్ద ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ లో రాత్రి వేళ ఓ మహిళ చేసిన రచ్చ చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. ఆమె తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా, మరో వాహన దారుడు ఢీకొని వెళ్లడమే ఈ గొడవకు కారణం అయింది. ఆ కోపంతో తన కారును గుద్ది ఆపకుండా వెళ్లిన వ్యక్తిని ఎట్టకేలకు నిలువరించిన ఆమె అతనిపై విరుచుకుపడింది. ఆతణ్ని అందరి ముందు చెప్పుతో కొడుతూ నానా భీభత్సం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
మా మామయ్య కూకట్ పల్లి సీఐ. నా కారునే డ్యామేజ్ చేస్తావా? చెప్పు తీసుకుని కొడతా! అంటూ రాత్రివేళ నడిరోడ్డుపై మహిళ రచ్చ చేసింది. హైదరాబాద్ లోని మీర్‌పేట్ సమీపంలోని టీకేఆర్ కమాన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓ కారు ఓవర్ టేక్ చేసే క్రమంలో పక్క నుంచి తగిలి స్వల్పంగా దెబ్బతింది. దీంతో కారులో ఉన్న మహిళ కిందకు దిగి హల్ చల్ చేసింది. తాను కూకట్ పల్లి సీఐ చంద్రయ్య బంధువునని.. తన కారునే డ్యామేజ్ చేస్తావా అంటూ మరో కారులో ఉన్న వ్యక్తి షర్ట్ పట్టుకుని లాక్కెళ్లి దాడి చేసింది. స్థానికులు వారిస్తున్నా ఆమె శాంతించలేదు. ఆగ్రహంతో ఊగిపోతూ అవతలి వ్యక్తిపై తీవ్ర అసభ్యపదజాలంతో నానా భీభత్సం చేసింది. దీంతో కాసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా, మీరు ఎందుకు వీడియో తీస్తున్నారని మహిళ దబాయించింది. అయినా వీడియో తీస్తూనే ఉండడంతో తీస్కోండి.. తీస్కోండి అంటూ అరిచింది. ‘‘వాడు నా కారును గుద్దేసి ఓవర్ టేక్ చేసి వెళ్లిపోతున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు? నేను వాడిని చెప్పుతో కొట్టలేదు.. వాడిని పిలవండి. నేను కొట్టానో లేదో చెప్పడానికి మీరెవరు. నేను చెప్పుతో కొట్టలేదు. మా మామయ్య కూకట్ పల్లి సీఐ చంద్రయ్య’’ అని ఆ మహిళ దబాయించారు. పోలీసుల్లో మీ బంధువులు ఉన్నారని ఇలా దబాయిస్తారా? చెప్పులతో కొడతారా అని ప్రశ్నించారు. మీరు లీగల్ గా వెళ్లొచ్చు కదా.. అని అడగ్గా.. ‘‘మా బండి డ్యామేజ్ అయింది. మీరందరు నన్ను అడగడం ఏంది? వాడు గుద్దేసి వెళ్లిపోయినా పర్లేదా? మేం చచ్చిపోయి ఉంటే ఇట్లనే అడుగుతరా?’’ అంటూ ఆగ్రహంతో మహిళ ఊగిపోయింది. అప్పటికే జనం బాగా గుమిగూడిపోయారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను శాంతింపజేశారు.