Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్! ఈ ప్రాంతాల్లో మంచి నీళ్ల సరఫరాకు అంతరాయం
Hyderabad Water Supply: జూన్ 1న ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అంటే జూన్ 2వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు.
Hyderabad Water Supply News: హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా లైన్లకు మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ వివరాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరానికి (Hyderabad City) మంచి నీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్ -3కి సంబంధించి సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1,200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు నీటి లీకేజీలు ఉన్నాయని అందులో పేర్కొంది. వాటికి మరమ్మతులు చేసేందుకు గానూ శంకర్ పల్లి ప్రాంతం సమీపంలో 3 చోట్ల మరమ్మత్తులు పనులను జలమండలి చేపట్టనుంది.
24 గంటల పాటు ఈ పనులు జరుగుతుండడం వల్ల నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. అందువల్ల 2022 జూన్ 1న ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అంటే జూన్ 2వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ 24 గంటల వరకు ఖానాపూర్ కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
నీళ్ల సరఫరా నిలిచే ప్రాంతాలు ఇవే.. (Hyderabad Water Supply Interuption)
ఓ ఆండ్ ఎం డివిజన్ - 3, 15, 18 పరిధిలోని మణికొండ, కోకాపేట, గండిపేట, నార్సింగి, మంచిరేవుల, హుడా కాలనీ, పుప్పాలగూడ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, చందానగర్, గోపన్ పల్లి, గుల్మొహర్ పార్కు, లింగంపల్లి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, నేతాజీనగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, నెహ్రూ నగర్, చింతలబస్తీ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 1న నీటి సరఫరా జరగబోదని వెల్లడించారు.