Hyderabad Bonalu 2022: లష్కర్ బోనాలకు అంతా సిద్ధం.. ఆదివారం ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
Hyderabad Bonalu 2022: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
Hyderabad Bonalu 2022: సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల ఉత్సవాలు రేపే జరగబోతున్నాయి. వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనం సమర్పించేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు భక్తులు. ఈ బోనాల కోసం భాగ్యనగర వాసులే కాకుండా మిగతా జిల్లాల వాళ్లు అలాగే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు.అందుకే ఈ బోనాల ఉత్సవాలు తెలంగాణకు తలమానికంగా నిలుస్తాయి.
2500 మంది పోలీసులతో బందోబస్తు..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జులై 17వ తేదీ ఆదివారం జరగనున్నాయి. లష్కర్ బోనాలకు సీఎం కేసీఆర్ సహా చాలా మంది వీఐపీలు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో లష్కర్ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉండడంతో మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులు 280 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు.
మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
బందోబస్తు ఏర్పాట్లు ఎలా చేశారన్న దాన్ని సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. సీఎం కేసఆర్ సహా మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశాలు ఉండడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా భక్తుల భద్రత కోసం షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు బందోబస్తులో ఉంటారు. బోనంతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లను పూర్తిగా సీసీటీవి కెమెరాల నిఘా నీడలోకి తెచ్చారు. మహంకాళి పీఎస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కెమెరాలను కనెక్ట్ చేశారు.
పాత నేరస్తుల ఫొటోలతో పోస్టర్లు..
పిక్ పాకెటర్లు, చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మహిళలను అప్రమత్తం చేసేందుకు పాత నేరస్తుల ఫొటోలతో కూడిన పోస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పాసెస్ ఉన్న వారిని మాత్రమే అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం స్పెషల్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసే వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ట్రాఫిక్ ను డైవర్షన్స్ చేశారు. ఆలయానికి 2 కిలో మీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆదివారం ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఇవే..
కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వెహికల్స్ ను రాణిగంజ్ క్రాస్ రోడ్స్, మనిస్టర్ రోడ్స్, రసూల్ పురా క్రాస్ రోడ్స్, పీఎస్టీ ఫ్లైఓవర్, హెచ్ఐఎస్ యూటర్న్, సీటీఓ, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం లేన్ మీదుగా దారి మళ్లించనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వెహికల్స్ చిలకలగూడ క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బైబిల్ హౌస్ నుంచి రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వచ్చే వాహనాలు ఘస్మండి క్రాస్ రోడ్స్ మీదుగాసజ్జ్లాల్ స్ట్రీట్ హిల్ స్ట్రీట్ రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నారు.