Traffic Challan Discount: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఇంకా కట్టలేదా? మీకో గుడ్ న్యూస్! మళ్లీ గడువు పెంపు
Telangana Govt: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో (జనవరి 31) ముగియనుంది.
Hyderabad Traffic e Challan: తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే గత నెల రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో (జనవరి 31) ముగియనుంది. కానీ, ప్రభుత్వం ఈ గడువును మరింత పెంచింది. ఫిబ్రవరి నెల 15 వరకూ గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం వాహనదారులు గత డిసెంబరులోపు ఉన్న తమ పెండింగ్ చలాన్లను 90 శాతం వరకూ డిస్కౌంట్‌తో చెల్లించవచ్చు.
గతేడాది డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై తొలుత తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 10 నాటికే పెండింగ్ చలాన్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.113 కోట్లు ఆదాయం సమకూరింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాల చలాన్లపై 60 శాతం ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను జనవరి 10లోపు చెల్లించారు.
పెండింగ్‌లో ఉన్న చలాన్ల గడువు తొలుత డిసెంబరు 25 నుంచి జనవరి 10 వరకూ ఉండగా.. ప్రభుత్వం దాన్ని జనవరి 31 వరకూ పెంచింది. తాజాగా ఫిబ్రవరి 15 వరకూ పెంచారు.