CV Anand: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
Hyderabad CP CV Anand: విద్యా సంస్థల్లో అమ్మాయిల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక చట్టం తీసుకురానుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
TS Govt special law for protection of girls in Educational Institutuions says CP CV Anand
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో అమ్మాయిల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక చట్టం తీసుకురానుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఓయూ ఠాగూర్ స్టేడియంలో శనివారం మాదక ద్రవ్యాల వ్యతిరేక (Anti Drugs Summit) సదస్సు జరిగింది. ఓయూ వీసీ లక్ష్మీనారాయణ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలికలు, యువతుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాల నివారించేందుకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానుందని తెలిపారు.
డీఏవీ స్కూల్ ఘటనతో ప్రభుత్వం కీలక నిర్ణయం !
బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు షీ టీమ్స్ ఏర్పాటు సహా ఎన్నో కఠిన చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ క్రమంలో స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న బాలికలు, యువతులపై అఘాయిత్యాలు అరికట్టేందుకు త్వరలోనే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరిగానే ఈ ప్రత్యేక చట్టం బాలికలు, యువతుల రక్షణ, భద్రత కోసం పని చేస్తుందన్నారు. ఇటీవల డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన తర్వాత విద్యా సంస్థలల్లో బాలికలు, యువతుల రక్షణ కోసం ప్రత్యేక చట్టంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. విద్యార్థులు సైతం మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటం ఆందోళన కలిగిస్తుందన్నారు.
ఆందోళన పెంచుతున్న డ్రగ్స్ విక్రయాలు
దేశంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి సంఖ్య 11 కోట్లకు చేరిందని సీవీ ఆనంద్ తెలిపారు. దేశంలో గోవా డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, అక్కడి నుంచి తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ముఖ్య నగరాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సీక్రెట్ గా సరఫరా చేసి విక్రయాలు చేస్తున్న గ్యాంగ్ లపై నిఘా ఉంచామని, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు వాటి పరసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వారిపై ఫోకస్ చేసి, పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని, దాని వల్ల యువత భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని హైదరాబాద్ సీపీ ఆందోళన వ్యక్తం చేశారు.
పదేళ్ల కిందట కాలేజీలలో ర్యాగింగ్ సమస్య ఉండేదని, దాన్ని అరికట్టేందుకు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు వేశామన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలతో ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ గుర్తు చేశారు. ప్రస్తుతం గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలను నిరోధించాల్సిన అవసరం ఉందని, యాంటీ డ్రగ్స్ కమిటీల్లో విద్యార్థులు చేరితే బాగుంటుందని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా, డ్రగ్స్ లేని స్టేట్‌గా తెలంగాణను మార్చాలని అధికారులు, పోలీసులకు సూచించారు.